Congress: పెట్రోల్-డీజిల్‌, విద్యుత్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై తెలంగాణ కాంగ్రెస్ భ‌గ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న‌లు, నిరస‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా నిన‌దించింది.  

fuel, electricity price hike: గ‌త కొన్ని రోజులుగా దేశంలో రికార్డు స్థాయిలో చమురు ధ‌ర‌లు పెరుగుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో వాహ‌న‌దారుల‌తో పాటు సామాన్య ప్ర‌జానీకం పైనా ఆర్థిక భారం ప‌డుతోంది. మ‌రోవైపు పెరిగిన వంట‌గ్యాస్ ధ‌ర‌లు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్న త‌రుణంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆందోళ‌న‌కు దిగింది. తెలంగాణ వ్యాప్తంగా నిర‌స‌నల‌కు పిలుపునిచ్చింది. ఇంధనం, విద్యుత్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కార్యకర్తలు బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు.

పెద్దపల్లి నియోజ‌కవర్గంలో కాంగ్రెస్ నాయకులు పట్టణ ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుల (కేసీఆర్‌) ల‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను తీరును ఖండించారు. ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకంగా నిన‌దించారు. ధ‌ర‌ల పెరుగుద‌ల నియంత్ర‌ణ‌కు ప్ర‌భుత్వాలు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌నీ, చ‌మురు, వంట గ్యాస్‌, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లను త‌గ్గించాల‌ని డిమాండ్ చేస్తూ.. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆందోళ‌న‌కు దిగారు. కాంగ్రెస్ జెండాల‌ను ప‌ట్టుకుని రోడ్ల‌పై భైటాయించారు. 

ద్రవ్యోల్బణం మరియు ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా నిరసనను ప్రారంభించింది. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉందని, దానిని వెనక్కి తీసుకోవాలని ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇంధ‌నంతో పాటు నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల పెరుగుద‌లపై కాంగ్రెస్ ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తోంది. అలాగే, రైతు స‌మ‌స్య‌ల‌ను కూడా కాంగ్రెస్ లేవ‌నెత్తుతోంది. గ‌త కొంత కాలంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా ఉన్న ధాన్యం కొనుగొలు విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రాజ‌కీయాలు చేస్తూ.. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయ‌ని కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ విష‌యంలో ప‌రిష్కారం దిశ‌గా ముందుకు సాగ‌కుండా రాజ‌కీయాల చేస్తూ.. రైత‌న్న‌ల‌తో చెల‌గాటం ఆడుతున్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు.

ఇదిలావుండ‌గా, దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని విధంగా నిత్యం పెరుగుతూనే ఉన‌నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు ఆల్‌టైం గ‌రిష్టానికి చేరుకున్నాయి. గ‌త 16 రోజుల్లో ఏకంగా 14 సార్లు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. బుధ‌వారం కూడా లీట‌రు పెట్రోల్‌, డీజిల్ పై 80 పైస‌ల‌ను చ‌మురు కంపెనీలు పెంచాయి. మొత్తంగా 16 రోజుల్లోనే లీట‌రు పెట్రోల్ పై రూ.10 పెరిగింది. ప్ర‌స్తుతం దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌రు పెట్రోల్ ధ‌ర లీటర్‌కు రూ. 105.41 కాగా, డీజిల్‌ రూ. 96.67 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 120.51 కాగా, డీజిల్‌ రూ. 104.77గా ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110.09 కాగా, డీజిల్ రూ. 100.18గా నమోదైంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 111.05 కాగా, డీజిల్‌ రూ. 94.81 వద్ద కొనసాగుతోంది.