హుజూర్ నగర్: కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటించిన కోమటిరెడ్డి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయోద్దని సూచించారు. 

తెలంగాణ రాష్ట్రంలో కేవలం నాలుగు కుటుంబాలే బాగుపడుతున్నాయని ఆరోపించారు. ఉత్తమ్ పద్మావతిని గెలిపించి తెలంగాణ ప్రజలు దీపావళి పండుగ చేసుకోవాలని సూచించారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ కు అధికారం, డబ్బు ధ్యాసే తప్ప పాలనపై ఎలాంటి ప్రత్యేక దృష్టి లేదన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని తిట్టిపోశారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్లు డబ్బులిస్తే తీసుకోవాలని సూచించారు.

ప్రజల నుంచి దోచుకున్న సొమ్మే తిరిగి ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒకవేళ డబ్బు ఇవ్వకపోతే అవసరమైతే ధర్నా కూడా చేయాలంటూ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూర్ నగర్ నియోజకర్గంలో ప్రజాస్వామ్యం బతికిబట్టకట్టాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిని గెలిపించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.