తెలంగాణలో దళిత వర్గానికి చెందిన శీలం రంగయ్య అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పందించారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... వన్యప్రాణుల కేసులో రంగయ్యను మూడు రోజులుగా పోలీసులు చిత్రహింసలు పెట్టారని ఆరోపణలు ఉన్నాయని అన్నారు.

రంగయ్య పై వన్యప్రాణుల కేసులో పిడీ యాక్ట్ పెడతామని పోలీసులు బెదిరించడం వల్లే ఆయన చేయని నేరానికి ఆత్మహత్య చేసుకున్నారని శ్రీధర్ బాబు ఆరోపించారు. జంతువు గురించి మనిషి బలయ్యాడన్న ఆయన... వన్యప్రాణులను కాపాడాలి కానీ విచారణ సరైన పద్ధతిలో చేయాల్సి ఉందని గుర్తుచేశారు.

ఈ నెల 24న రంగయ్యను రిమాండ్ చేస్తే పోలీస్ స్టేషన్‌లో ఆయన  ఎలా ఆత్మహత్య చేసుకున్నారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రంగయ్య కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు వున్నాయన్న ఆయన.. ఈ కేసుపై జ్యూడిషియల్ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

అదే సమయంలో ఒకవేళ రంగయ్య తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం  ఏర్పాటైన తర్వాత 10 నుంచి 15 కస్టడీయల్ డెత్స్ నమోదయ్యాయని గుర్తుచేశారు. దళితుల పై పోలీసుల జులం కరెక్ట్ కాదని... రంగయ్య కేసును ఎస్సీ, ఎస్టీ కమీషన్ దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు చెప్పారు.

ఈ కేసులో అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖ, డీజీపీపై ఉందని ఆయన అన్నారు.  ఫ్రెండ్లి పోలీసింగ్ అంటే కస్టడీయల్ డెత్ చేయడమా? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. రంగయ్య కుటుంబ సభ్యులు కాంప్రమైజ్ కావాలని ఇద్దరు ప్రత్యేక అధికారులను డీజీపీ నియమించడం దారుణమన్నారు.

మంథని డివిజన్ పరిధిలో లేని అధికారులు రంగయ్య కుటుంబాన్ని భాదించడం ఏంటని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మృతుడికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంథని ఘటనపై డీజీపీ, హోంమంత్రి స్పందించాలని.. వెంటనే ఫొరెన్సిక్ ద్వారా నిజనిర్ధారణ నిగ్గు తేల్చాలని శ్రీధర్ బాబు కోరారు.