హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడానికి ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించారు.  

ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రవాణా మంత్రి ఆ పదవికి అనర్హుడంటూ ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు 9 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సరికాదన్నారు. 

సమైక్యరాష్ట్రంలో ఇంత దారుణంగా ఎప్పుడూ జరగలేదని జగ్గారెడ్డి విమర్శించారు. ఇలాంటి పాలన కోరుకున్నామా అని తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కార్మికులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కాంగ్రెస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్ కి ఎవరో విషాన్ని నూరిపోస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం ఒక మెట్టు దిగి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని జగ్గారెడ్డి సూచించారు.

లేకపోతే ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ పీకమీద కూర్చుంటారంటూ తిట్టిపోశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రతిపక్షాలు మద్దతు పలుకుతున్నాయంటూ విరుచుకుపడుతున్న తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో ప్రతిపక్షం ఎక్కడ ఉందంటూ నిలదీశారు. 

ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అది మంచిపద్దతి కాదన్నారు. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం పనిచేయాలని లేని పక్షంలో మరో ఉద్యమం తప్పదని జగ్గారెడ్డి హెచ్చరించారు.