తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటున్నది. పార్టీ నేతలంతా ఇంతకాలం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తలోదారిలో ఉండేవారు. అటువంటి వాతావరణం నుంచి బయటపడి అందరూ కలిసిపోతున్న పరిస్థితి నెలకొంది. అక్కడక్కడ ఇంకా సిగపట్లు బాగానే ఉన్నాయి కూడా. ఇక పార్టీలో ఐక్యత సాధించామన్నట్లుగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికార టిఆర్ఎస్ పార్టీపై మైండ్ గేమ్ పాలిటిక్స్ మొదలు పెట్టింది. అధికార టిఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ వారికి అల్కగ దొరికిన నాయకుడు ఎవరంటే మంత్రి హరీష్ రావే. అందుకే ఏరకమైన మైండ్ గేమ్ ఆడినా హరీష్ రావు చుట్టూ తిప్పడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్న చర్చ ఉంది.

తాజాగా నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ రాజకీయాలనుంచి తప్పుకోగానే.. బావ హరీష్ రావు, బామ్మార్ది కేటిఆర్ రోడ్ల మీద కొట్టుకుంటారని కామెంట్ చేశారు. అంతేకాకుండా టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావును కేటిఆర్ అవమానిస్తున్నారని కూడా చెప్పారు. హరీష్ రావును అవమానించినట్లే.. హరీష్ రావు కొడుకును కేటిఆర్ కొడుకు అవమానిస్తున్నాడని కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అయినప్పటికీ రేపు టిఆర్ఎస్ కు నాలుగు ఓట్లు వస్తే.. హరీష్ రావు వల్లే వస్తాయని కూడా చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఇదిలా ఉంటే.. మొన్నటికి మొన్న గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ కూడా హరీష్ రావు కేంద్రంగా టిఆర్ఎస్ పార్టీపై మైండ్ గేమ్ పాలిటిక్స్ కు తెర తీశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వస్తున్నారు.. తీసుకుంటున్నారా అన్న ప్రశ్నకు డికె అరుణ స్పందిస్తూ.. టిఆర్ఎస్ నుంచి హరీష్ రావు వచ్చినా.. కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటామని హాట్ కామెంట్స్ చేశారు.

ఇక ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు కేంద్ర బిందువుగా పలు కీలకమైన కామెంట్స్ చేశారు. రానున్న ఎన్నికల్లో కేసిఆర్, కేటిఆర్ కు త్రెట్ ఉన్న నేతలందరినీ పార్లమెంటుకు పంపుతారని రేవంత్ అన్నారు. అందులో హరీష్ రావు, కడియం శ్రీహరి లాంటి వాళ్లంతా పార్లమెంటుకు పోతారని వ్యాఖ్యానించారు. మంత్రి కేటిఆర్ కు హరీష్ తో ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకవైపు హరీష్ రావుపై సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తూనే.. మరోవైపు హరీష్ రావు కేంద్రంగా మైండ్ గేమ్ నడుపుతున్నారు. అయితే.. మైండ్ గేమ్ లో కాంగ్రెస్ కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివిన టిఆర్ఎస్ రానున్న రోజుల్లో హరీష్ కేంద్రంగా సాగుతున్న మైండ్ గేమ్ కు ఎలాంటి చెక్ పెడుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.  

కోమటిరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావు గురించి మాట్లాడిన వీడియో కింద ఉంది చూడొచ్చు.