Rajya Sabha: కాంగ్రెస్ రాజ్యసభ సీట్ల కోసం నేతల ప్రయత్నాలు.. పోటీలో ఉన్నవారు వీళ్లే
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాజ్యసభ సీట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నాలు చేస్తున్న నాయకుల సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్ర నాయకులే కాదు.. హైకమాండ్ కూడా పలువురిని తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయాలని భావిస్తున్నది.
Telangana Congress: రాజ్యసభ సీటు కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ అవకాశం కోసం పోటీ పడుతున్న కాంగ్రెస్ నాయకుల సంఖ్య పెరుగుతూ పోతున్నది. తెలంగాణలో కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నది. మరో సీటు గెలుచుకునే బలం బీఆర్ఎస్‌కు ఉన్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ మిస్ అయినవారు.. లోక్ సభలో టికెట్ వచ్చే అవకాశాలు స్వల్పంగా ఉన్నవారు రాజ్యసభ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. డిమాండ్ చేస్తున్నారు. ఇందులో సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు ఉన్నారు. ఆయన ఖమ్మం లోక్ సభ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రత్యామ్నాయంగా మరోసారి రాజ్యసభ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. వీహెచ్ నాలుగు సార్లు రాజ్యసభ ఎంపీగా చేశారు.
Also Read: KCR: ప్రతిపక్షంలో ఉన్నా.. కేంద్రానికి కేసీఆర్ సవాల్.. ఆ వ్యాఖ్యల వెనుక మర్మమేమిటీ?
రాజ్యసభ అవకాశం కోసం రేసులో ఉన్నవారిలో రేణుకా చౌదరి, బలరాం నాయక్, కే జానా రెడ్డి, జీ చిన్నారెడ్డి, జే గీతా రెడ్డి, జీ నిరంజన, టీ సుబ్బరామి రెడ్డిలు ఉన్నారు.
అయితే.. ఇందులో కోపతాపాలు ఏర్పడకుండా టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ముందుజాగ్రత్తగా.. అభ్యర్థులపై తుది నిర్ణయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేదేనని ఓ తీర్మానం చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా పవన్ ఖేరా, సుప్రియా శ్రీనాతె, జైరాం రమేశ్, కన్హయ్య కుమార్, దీపా దాస్ మున్షి వంటి వారిని రాజ్యసభకు నామినేట్ చేయాలని భావిస్తున్నది.