హైదరాబాద్: శనివారం టీఆర్ఎస్ పార్టీ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వరదసాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే వరద బాధిత కుటుంబాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న రూ.10వేల నగదు సాయాన్ని పొందాయని... మిగిలినవారికి జిహెచ్ఎంసి ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అందిస్తామని ప్రకటించారు. అయితే ఎన్నికల కోడ్ కొనసాగుతున్న సమయంలో సీఎం వరదసాయంపై మాట్లాడి ఎన్నికల నియమావళిని ఉళ్లంఘించారని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎస్ఈసీకి ఫిర్యాదు చేసింది. 

భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న నగర ప్రజలకు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల వరద సాయం పంపిణీ మధ్యలోనే నిలిచిపోయిందని... డిసెంబరు 7 నుంచి తిరిగి పంపిణీ చేపడతామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ నగర్ ప్రచారసభలో ప్రకటించారు. ఎన్నికల వేళ ఇలా నగదు సాయం హామీ ఇవ్వడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని ఆరోపిస్తూ ఎస్ఈసీ పార్థసారథికి కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ ప్రసంగానికి సంబంధించిన సీడీని ఫిర్యాదుకు జత చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. 

read more  గజగజ వణుకుతున్నారు: కేంద్రంపై నిప్పులు చెరిగిన కేసీఆర్

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్‌ నిరంజన్‌ శనివారం ఎస్ఈసికి ఈ-మెయిల్‌ ద్వారా ఫిర్యాదు పంపారు. ప్రభుత్వ ఆస్తులపై ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించాలని కూడా ఎస్ఈసి దృష్టి తీసుకెళ్లారు. 

అంతేకాకుండా పోలింగ్‌ రోజున పోటీలో నిలిచిన ప్రతి అభ్యర్థికి రెండు వాహనాలను అనుమతించాలని కోరారు. అభ్యర్థితో పాటు ఏజెంట్లు ప్రయాణించేందుకు వీలుగా ఈ వెసులుబాటు కల్పించాలని నిరంజన్ తన ఫిర్యాదులో ఎస్ఈసిని కోరారు.