కొద్దిరోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆసక్తికర ప్రకటన చేశారు. యావత్ దేశంలోని కార్మికులు, రైతాంగం పక్షాన ముందుండి పోరాటం చేస్తామన్నారు.

దీనిలో భాగంగా డిసెంబర్‌ రెండోవారంలో హైదరాబాద్‌ లో వివిధ రాష్ట్రాల్లోని విపక్షనేతలతో కాన్‌క్లేవ్‌ నిర్వహిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై త్వరలోనే దేశవ్యాప్త నిరసనకు టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతుందని కేసీఆర్ అన్నారు.

ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించి ఆరున్నరేండ్లు గడిచినా దేశంలో జరిగిన అభివృద్ధి ఏమీలేదని, పైగా దేశం ఇప్పుడు తిరోగమనంలో నడుస్తున్నదని కేసీఆర్ అంటున్నారు. 

దీనిపై శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలోనూ మరోసారి లేవనెత్తారు. 1350 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే.. 13పైసలు కూడా ఇవ్వలేదని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. మేం భారతీయులం కాదా?.. భారతదేశంలో లేమా? అని ప్రశ్నించారు.

పక్కనే ఉన్న కేరళ, కర్ణాటకకు ఇచ్చారని ఆయన విమర్శించారు. వరద సాయం చేయకుండా కేంద్రమంత్రులు ఇప్పుడు వరదలా వస్తున్నారు. ఇవి స్థానిక ఎన్నికలా? జాతీయస్థాయి ఎన్నికలా? బక్క కేసీఆర్‌ను కొట్టడానికి ఇంతమందా? అంటూ సీఎం కేసీఆర్‌ తనదైన శైలిలో ప్రసంగించారు. 

కేసీఆర్‌ ఢిల్లీకి వస్తున్నాడని తెలిసి గజగజా వణుకుతున్నారని ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి కూడా వస్తున్నారు ఆయన ఎద్దేవా చేశారు.

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలను ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించిన కేసీఆర్ యూపీ సీఎం ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారని.. 28 ర్యాంకులో ఉన్నాయన మనకేం చెబుతారని ధ్వజమెత్తారు.

కేసీఆర్ మీ బిడ్డ.. తెలంగాణ గడ్డ బిడ్డ అంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసిన ఆయన... వరద బాధితులను ఆదుకునేందుకు రానివారు ఓట్ల కోసం వరదలా వస్తున్నారని విమర్శించారు. మూస రాజకీయాలకు ఇకనైనా స్వస్తి చెప్పాలని తెలంగాణ సీఎం విజ్ఞప్తి చేశారు.