ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అభినందించారు. వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అమానుష దాడితో యావత్తు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడి పడింది.

ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో ఏపీ అసెంబ్లీలో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదన చేసిన ఏపీ సీఎం జగన్ గారిని అభినందిస్తున్నాను.

Also Read:మహిళా రక్షణకై వైసిపి ప్రభుత్వం చేపట్టిన చర్యలివే: హోంమంత్రి సుచరిత

అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా.. కొత్తగా ప్రవేశపెట్టబోయే చట్టానికి సంబంధించి జగన్ గారు మాట్లాడుతూ... సోషల్ మీడియా ద్వారా మహిళలపై అసభ్య సందేశాలు పంపే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం హర్షణీయం.

తెలంగాణ మహిళల భద్రత కోసం ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను. అంటూ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. 

దిశపై జరిగిన దారుణం తనను కలచివేసిందని జగన్ అసెంబ్లీలో చెప్పుకొచ్చారు. దిశలాంటి ఘటన ఏపీలో జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై రాష్ట్రంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. 

నిందితులను ఎన్ కౌంటర్ చేయడంలో ఎలాంటి తప్పులేదన్నారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆ ఇద్దరు కూడా ఆడపిల్లలేనని జగన్ చెప్పుకొచ్చారు. తనకు ఒక చెల్లి కూడా ఉందని సభలో స్పష్టం చేశారు. తనకు భార్య ఉందని చెప్పిన జగన్ వెంటనే ఒక్కతే భార్య అంటూ పవన్ పై మరో సెటైర్ వేశారు సీఎం జగన్. 

ఒక ఆడపిల్లకు ఏదైనా జరిగితే వారి తల్లిదండ్రులకు ఆ బాధను తీర్చలేము గానీ నిందితులకు ఎలాంటి శిక్షలు వేస్తే ఆ తల్లిదండ్రులు శాంతిస్తారో అలాంటి శిక్షలు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ తెలిపారు. 

Also Read:ఆయనకి ముగ్గురు పెళ్లాలు, నాకు ఒక్కతే భార్య: పవన్ పై జగన్ సెటైర్

తాను ముఖ్యమంత్రి అయిన ఆర్నెళ్ల కాలంలో రాష్ట్రంలో మహిళలపైనా, చిన్నారులపైనా జరుగుతున్న దారుణాలు తనను కలచివేశాయని జగన్ చెప్పుకొచ్చారు. నిందితులకు శిక్షలు పడటం లేదని తాను భావించానని ఇకపై చట్టాల్లో మార్పులు తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు జగన్. 

మహిళలపై దారుణాలను అరికట్టాలన్నదే తన ముందు ఉన్న లక్ష్యమని జగన్ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యురాలు దిశపై రేప్, అత్యాచార ఘటనను గుర్తు చేస్తూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.