తెలంగాణ కాంగ్రెస్ నేత, ఫైర్ బ్రాండ్ విజయశాంతి బీజేపీపైనా, ప్రధాని నరేంద్రమోడీపైనా ఘాటు విమర్శలు చేశారు. యుద్ధం పేరుతో బీజేపీ చివరి క్షణంలో జిమ్మిక్కులు చేస్తుందని కొద్ది నెలల క్రితమే తాను హెచ్చరించానన్నారు.

తాను అప్పుడు చెప్పిన మాటను పవన్ కల్యాణ్ కూడా బలపరుస్తున్నారన్నారు.  ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. "ప్రాణాలకు తెగించి శత్రు దేశంతో పోరాడుతున్న సైనికుల త్యాగాన్ని యడ్యూరప్ప వంటి బీజేపీ నేతలు రాజకీయానికి వాడుకోవడాన్ని చూసి, దేశప్రజలు ఛీ కొడుతున్నారు.

ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమై, దేశ ప్రజలను జీఎస్టీ పేరుతోనూ, డీమానిటైజేషన్ పేరుతోనూ మోదీ ప్రభుత్వం అన్నీ రకాలుగా ఇబ్బందిపెట్టింది. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి తమ వైఫల్యాలను కప్పిబుచ్చుకునేందుకు చివరకు దేశభద్రతను పణంగా పెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోంది.

రాజకీయాలకంటే దేశ భద్రతే ముఖ్యమని భావించడం వల్లే ప్రతిపక్షాలన్నీ పాకిస్థాన్ పై తీసుకోబోయే చర్యలకు ఎన్డీఏ సర్కారుకు పూర్తి మద్దతు తెలిపాయి. కానీ ప్రతిపక్షాలకు ఉన్న నిబద్ధత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి లేకపోవడం దురదృష్టకరం" 

"యడ్యూరప్ప చేసిన కామెంట్ నుంచి దేశ ప్రజలు తేరుకోక ముందే.. పాకిస్తాన్‌పై కౌంటర్ అటాక్‌కి సంబంధించిన పరిణామాలను దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రజలకు వివరించకుండా బీజేపీకి చెందిన బూత్ కార్యకర్తలకు వివరించడం ద్వారా వారి రహస్య అజెండా బయటపడింది.

దీన్నిబట్టి యుద్ధం పేరుతో బీజేపీ ఎన్నికల్లో ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకునే ప్రయత్నం చేస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి". యుద్ధం పేరుతో బీజేపీ చివరి క్షణంలో జిమ్మిక్కులు చేస్తుందని కొద్దినెలల క్రితం తాను హెచ్చరించాను.

నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇదే విషయాన్ని ధ్రువపరించారు. పవన్ వాదనను నేను పూర్తిగా సమర్ధిస్తున్నాను. ఇప్పటికైనా దేశ భద్రత వంటి సున్నిత అంశాంలను రాజకీయాల కోసం వాడుకునే నీచ ప్రయత్నాలను బీజేపీ మానుకోవాలన్నది నా సూచన’’ అంటూ విజయశాంతి పోస్ట్ చేశారు.