హైదరాబాద్: టీఎస్ పిడిసిఎల్ సిఎండి ప్రభాకర్ రావుపై తెలంగాణ కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ప్రభాకర రావును గన్ పార్కు ముందు నిలబెట్ిట కాల్చినా తప్పు లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి తాజాగా శనివారం ఆయనకు సవాల్ విసిరారు. అక్రమాలకు సంబంధించిన వివరాలను తాను ఇస్తున్నానని, దమ్ముంటే వాటిని కాదని చెప్పాలని, అందుకు వివరాలతో ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు. 

రూ. 35 వేల కోట్ల అప్పులు మాత్రమే చేశామని ప్రభాకర్ రావు చెబుతున్న మాటలు అవాస్తవమని, గత నాలుగున్నర ఏళ్లలో 74 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారని, సమైక్య రాష్ట్రంలో 65 ఏళ్లలో కేవలం 25 వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు చేశారని, అప్పులు చేస్తూ సంస్థను దివాళా పట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. 

ప్రభాకర్ రావు సహా ముగ్గురు రిటైర్డ్ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన పదవుల్లో నియమించి పిడిఎస్ఎల్ ను అప్పుల ఊబిలో ముంచేశారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. విద్యుత్తు శాఖలో వారు ఆడిందే ఆటగా సాగుతోందని అన్నారు. ప్రభాకర రావుకు మద్దతుగా ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగడాన్ని ఆయన తప్పు పట్టారు. 

ఉద్యోగులకు అవినీతిలో వాటా ఏమైనా ఉందా, వారికి ఏమైనా అందుతుందా అని అడిగారు. ఉద్యోగ సంఘాలు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పనిచేయాలి గానీ అవినీతి అధికారులకు వత్తాసు పలకడానికి కాదని అన్నారు 

అసమర్థులైన అనుభవం లేని అధికారుల వల్ల అధిక ధరలు పెట్టి విద్యుత్తు కొనుగోలు చేసి వనియోగదారులపై భారం మోపడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. సమస్యను అధికారులకు, కాంగ్రెసుకు మధ్య గొడవ చిత్రీకరించే ప్రయ.త్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభాకర రావు మాట వినడం లేదని కొంత మంది అధికారులను బదిలీ కూడా చేశారని ఆయన అన్నారు. తప్పుడు ఒప్పందాలను అంగీకరించని అధికారులను బదిలీ చేశారని ఆయన అన్నారు.  

సంబంధిత వార్త

ట్రాన్స్‌‌కో సీఎండీప్రభాకర్‌రావును కాల్చినా తప్పులేదు: రేవంత్ రెడ్డి