తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డికి పుత్రశోకం కలిగింది. ఆయన కుమారుడు దినకర్ రెడ్డి మరణించారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు.

జనార్థన్ రెడ్డికి ఇద్దరు కుమారులు కాగా..పెద్ద కుమారుడైన దినకర్ రెడ్డి వైద్యుడిగా పనిచేస్తూనే.. సివిల్ కాంట్రాక్టులు కూడా చేస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో గత వారం అపోలోలో చేరిన దినకర్ రెడ్డికి ఊపరితిత్తులు మార్చాలని వైద్యులు సూచించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తుండగానే.. గురువారం రాత్రి ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు..

దినకర్ రెడ్డి మరణంతో నాగం కుప్పకూలిపోయారు.. ఆయనను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.. విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ నేతలు అపోలోకి చేరుకుని దినకర్‌రెడ్డికి నివాళులర్పించి.. నాగంను పరామర్శించారు.