తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని.. కల్వకుంట్ల కవితపై చర్యలు ఎందుకు తీసుకురావడం లేదని థాక్రే ప్రశ్నించారు. 

బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు థాక్రే. శనివారం హైదరాబాద్‌లో యూత్ కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలు లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. అందుకే మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని మాణిక్‌రావ్ థాక్రే అన్నారు. కేసీఆర్ మహారాష్ట్రలో ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయాలను వదిలేస్తానని ఆయన సవాల్ విసిరారు. బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య ఒప్పందం లేకుండా కల్వకుంట్ల కవితపై చర్యలు ఎందుకు తీసుకురావడం లేదని థాక్రే ప్రశ్నించారు. 

ఇకపోతే.. థాక్రే శుక్రవారం కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలతో హైకమాండ్ టచ్‌లో వుందన్నారు. షర్మిల వస్తే ఏపీ కాంగ్రెస్‌కు ఎంతో లాభమని థాక్రే వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ముందుగానే అభ్యర్ధులను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. రెండు దశల్లో అభ్యర్ధుల జాబితాను వెల్లడిస్తామని.. బీఆర్ఎస్, బీజేపీల నుంచి రానున్న కాలంలో కాంగ్రెస్‌లోకి చేరికలుంటాయని మాణిక్‌రావు థాక్రే పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క గట్టిగా పోరాడుతున్నారని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా భట్టి విక్రమార్క పాదయాత్ర పార్టీకి చాలా దోహదం చేస్తోందన్నారు.

ALso Read: షర్మిలతో టచ్‌లోనే హైకమాండ్ .. కాంగ్రెస్‌లో చేరితే ఏపీకే : మాణిక్‌రావు థాక్రే సంచలన వ్యాఖ్యలు

మరోవైపు.. తెలంగాణ బీజేపీలో అసంతృప్తులు ఉన్నారని, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు పార్టీ మారుతారని వార్తలు జోరుగా వస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నేతల మధ్య విభేదాల గురించి రిపోర్టు అడిగిన ప్రశ్నలకు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. పార్టీ మారడం అనేది వారి వారి రాజకీయల ఆలోచనలకు అనుగుణంగా ఉంటుందని అన్నారు. 

కాంగ్రెస్‌ను పరోక్షంగా పేర్కొంటూ.. మునిగిపోయే నావలోకి వెళ్లుతామనే వాళ్లను తాము ఎవ్వరమూ ఆపబోమని స్పష్టం చేశారు. డిపాజిట్లు రాని, అసలు అభ్యర్థులే లేని పార్టీలోకి ఎవరు పోతారనేది అసలు ప్రశ్న అని తెలిపారు. తమ పార్టీ నుంచి ఎవరూ పోవడం లేదని అన్నారు. అది కేవలం మీడియా దుష్ప్రచారం అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మరింత స్పష్టత కోసం విలేకరులు ప్రశ్నించగా.. తమ పార్టీ నుంచి ఎవ్వరూ పోరు అని చెప్పారు.