సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు సభలోనే కాంగ్రెస్‌లోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరుతారని తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ థాక్రే.  

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూలై 2న కాంగ్రెస్‌లో చేరుతారని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజున సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ కూడా జరగనుంది. ఈ క్రమంలో పొంగులేటి చేరిక కార్యక్రమాన్ని మరో రోజుకు వాయిదా వేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కేడర్‌లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో కన్‌ఫ్యూజన్‌కు చెక్ పెట్టారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ థాక్రే. 

బుధవారం ఖమ్మం జిల్లా నాయకన్ గూడెం వద్ద పాదయాత్ర శిబిరంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను థాక్రే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం సభకు సంబంధించిన ఏర్పాట్లు, ఇతర విషయాలపై వారు చర్చించారు. అనంతరం మాణిక్‌రావు థాక్రే మీడియాతో మాట్లాడుతూ.. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ ముగింపు సభలోనే కాంగ్రెస్‌లోకి పొంగులేటి చేరుతారని ఆయన స్పష్టం చేశారు. భట్టి పాదయాత్రకు విశేష స్పందన వచ్చిందని థాక్రే ప్రశంసించారు. 

ALso Read: జూలై 2న ఖమ్మంలో కాంగ్రెస్ సభ: భట్టి, ఠాక్రే భేటీలో పాల్గొన్న పొంగులేటి

భట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మం సరిహద్దుకు చేరుకోగానే పొంగులేటి ఆయనకు స్వాగతం పలుకుతారని, అదే రోజు జరిగే సభలో శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని థాక్రే తెలిపారు. ఖమ్మంలో జన గర్జన సభకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసిన భట్టి విక్రమార్కను ఆ సభలో రాహుల్ గాంధీ ఘనంగా సత్కరిస్తారని మాణిక్‌రావు థాక్రే పేర్కొన్నారు. 

ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై థాక్రే విమర్శలు గుప్పించారు. 600 కార్లతో మహారాష్ట్రకు వెళ్లేందుకు కేసీఆర్‌కు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల సొమ్మును సీఎం తన సొంతానికి వాడుకుంటున్నారని థాక్రే ఆరోపించారు. జాతీయ మీడియాను ఆకర్షించేందుకు కేసీఆర్ పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని మాణిక్‌రావ్ థాక్రే పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని ఆయన ఆరోపించారు.