రాహుల్‌పై అసోం సీఎం వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. హిమంత బిశ్వ శర్మ దిష్టిబొమ్మను దగ్థం చేశాయి. అసోం సీఎంవి దిగజారుడు వ్యాఖ్యలని.. కొన్ని ఓట్ల కోసం చేశారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) ఖండించిన సంగతి తెలిసిందే. ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ కేసీఆర్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టీకాంగ్రెస్‌లో కదలిక వచ్చింది. రాహుల్‌పై అసోం సీఎం వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. హిమంత బిశ్వ శర్మ దిష్టిబొమ్మను దగ్థం చేశాయి. అసోం సీఎంవి దిగజారుడు వ్యాఖ్యలని.. కొన్ని ఓట్ల కోసం చేశారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
అసోం సీఎంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇది గాంధీ కుటుంబంపై జరిగిన దాడి కాదని.. దేశ సంస్కృతిపై జరిగిన దాడిగా రేవంత్ (revanth reddy) అభివర్ణించారు. వాస్తవాలను ప్రస్తావిస్తే బీజేపీ నేతలు.. ఏ రకమైన భాష ఉపయోగిస్తారో మనం చూస్తున్నామంటూ ఆయన దుయ్యబట్టారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై కేసులు పెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ప్రజా సమస్యలపై నిలదీస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోనేత జగ్గారెడ్డి (jagga reddy) మాట్లాడుతూ.. రాహుల్ కుటుంబం గురించి అడిగే అర్హత అసోం సీఎంకు లేదన్నారు. అసోం సీఎంకు ఎంతమంది తండ్రులని మేం అడగాలా అంటూ జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మను బర్తరఫ్ చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) డిమాండ్ చేశారు. దేశానికి మోడీ, బీజేపీ అధిష్టానం క్షమాపణలు చెప్పాలని.. ఇదేనా బీజేపీ సంస్కృతి అంటూ ఆయన ఫైరయ్యారు. అసోం సీఎం లాంటి నీఛమైన వ్యక్తులన్న బీజేపీ.. దేశాన్ని పాలించడం సిగ్గుచేటంటూ భట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ..రాహుల్ గాంధీపై (Rahul Gandhi) అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sarma) అలా దిగజారి మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. అహంకారమా..? కళ్లు నెత్తికెక్కాయా.. అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అస్సాం సీఎంను మోడీ బర్తరఫ్ చేయాలని.. రాహుల్‌ను ఉద్దేశించి నువ్వు ఎవరికి పుట్టావంటూ అస్సాం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కేసీఆర్. ఆ మాటలు వింటేననే తన కళ్ల వెంట నీళ్లు వచ్చాయని.. ఇదా మన సంప్రదాయం మోడీ.. నడ్డా సమాధానం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. సీఎం పదవి నుంచి ఆయనను బర్తరఫ్ చేయాలని కోరారు.
శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వానికి పిచ్చి ముదరుతోందని.. మోడీ ప్రభుత్వం పిచ్చి పిచ్చి పాలసీలు తెచ్చిందంటూ కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాటు రైతుల్ని ఏడిపించారని.. రైతుల్ని అవమానించారని, గుర్రాలతో తొక్కించారని సీఎం ఎద్దేవా చేశారు. చివరికి రైతుల మీదకి కార్లు కూడా ఎక్కించారని దుయ్యబట్టారు. మోడీ ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి కరెంట్ సంస్కరణ పేరుతో మీటర్లు పెట్టించిందని సీఎం ఆరోపించారు. మోడీ ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులిస్తాం లేకుంటే ఇవ్వబోమంటోందని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని తరిమి తరిమి కొట్టాలని సీఎం పిలుపునిచ్చారు.
