Asianet News TeluguAsianet News Telugu

శశిథరూర్ మీద వ్యాఖ్యలు: పుల్ల పెట్టిన కేటీఆర్, రేవంత్ రెడ్డి పీఛే ముడ్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ శశిథరూర్ పై చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. మరో వైపు ఈ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను ప్రత్యర్ధి పార్టీలు  రేవంత్ పై విరుచుకుపడేందుకు ఉపయోగించుకొంటున్నాయి.

Telangana Congress Chief Revanth Reddys Remarks On Shashi Tharoor Anger Party Leaders
Author
Hyderabad, First Published Sep 17, 2021, 12:25 PM IST


హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. తాను చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకొన్నా ప్రత్యర్ధి పార్టీలు దీన్ని అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీపై విమర్శలను ఎక్కుపెట్టాయి.

 

 

పార్లమెంటరీ స్లాండింగ్ కమిటీ ఛైర్మెన్ హోదాలో కమిటీ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో  శశిథరూర్ ఇటీవల కాలంలో పర్యటించారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో  అభివృద్ది కార్యక్రమాలను ప్రస్తావిస్తూ శశిథరూర్  అభినందించారు.  తెలంగాణ  ప్రభుత్వాన్ని అభినందించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.

also read:శశిథరూర్ పై కామెంట్స్.. వెనక్కి తగ్గిన రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో  టీఆర్ఎస్ సర్కార్ అవలంభిస్తున్న విధానాలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అదే పార్టీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత  శశిథరూర్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించడంతో కోపంతో రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శశిధరూర్ ను గాడిద అంటూ సంబోధించారు.ఈ విషయమై ఓ ఆడియో సంభాషణ వైరల్ గా మారింది.

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఈ ఆడియో క్లిప్ ను పోస్టు చేశారు.  ఓ క్రిమినల్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగితే ఇలానే ఉంటుందని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఈ విషయమై  సోషల్ మీడియా వేదికగా చర్చ ప్రారంభమైంది.దీంతో రేవంత్ రెడ్డి దిగొచ్చారు.

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కి ఫోన్ చేసి క్షమాపణలు కోరాడు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటున్నట్టుగా చెప్పారు. ఈ విషయమై శశిథరూర్ కూడా సానుకూలంగానే స్పందించారు.రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చర్చకు దారితీశాయి. తొందరపాటుతో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాన్ని కొందరు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.ప్రత్యర్ధి పార్టీ నేతలను విమర్శించినట్టుగా స్వంత పార్టీకి చెందిన నేతపై విమర్శలు చేయడం రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. అయితే ఈ విషయాన్ని గుర్తించి వెంటనే రేవంత్ రెడ్డి శశిథరూర్ కి క్షమాపణలు చెప్పారు.

ప్రత్యర్ధి పార్టీలను తన సవాళ్లతో రాజకీయంగా ఇబ్బందులు పెట్టే రేవంత్ రెడ్డి  స్వంత పార్టీ నేతపై చేసిన వ్యాఖ్యలు ఆయననే ఇబ్బందిపెట్టేలా చేశాయి. పార్టీలోని రేవంత్ రెడ్డి ప్రత్యర్ధులు ఇలాంటి అవకాశాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకొనేందుకు ప్రయత్నాలు చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల రాహుల్ తో జరిగిన సమావేశంలో ముఖాముఖి సమావేశానికి కొందరు సీనియర్లు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ ముఖాముఖి సమావేశానికి అనుమతిస్తే రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి వ్యవహరశైలిపై ఫిర్యాదు చేయాలని ఆ నేతల ప్లాన్. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు.

టీపీసీసీ చీఫ్ పదవికి పోటీ పడిన పార్టీ సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టింది. టీడీపీ నుండి వచ్చిన రేవంత్ రెడ్డి తమపై ఆధిపత్యం చెలాయించడాన్ని పార్టీలోని కొందరు సీనియర్లను అసంతృప్తికి గురిచేసింది.

తెలంగాణలో పార్టీపై పూర్తిగా పట్టు సాధించేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్నారు.ఈ తరుణంలో  ఈ తరహా వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బంది కల్గించేవిగా ఉన్నాయనే  అభిప్రాయాలను  విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేందుకు స్వంత పార్టీకి చెందిన వారితో పాటు ప్రత్యర్ధి పార్టీల నేతలు ఈ తరహా ఘటనలను ఉపయోగించుకొనే అవకాశం లేకపోలేదు. ఈ ఆడియో వ్యవహరంపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

స్థానికంగా ఉన్న పరిస్థితులను  తెలుసుకోకుండానే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించడంపై శశిథరూర్ పై రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు స్థానికంగా పార్టీ నేతల అభిప్రాయం తీసుకొంటే బాగుండేదని రేవంత్ రెడ్డి మనోగతంగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయినా  థరూర్ పై రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం కొంత ఇబ్బందేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు కూడ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కోరారు.శశిథరూర్ ను పార్టీ సీనియర్లు అండగా నిలిచారు.

Follow Us:
Download App:
  • android
  • ios