నిజామాబాద్ కు చెందిన మదన్ కుమార్ సతీమణి  మానస నిండుగర్భిణి. నెలలు నిండటంతో మదన్ కుమార్ ఆమెను డెలివరీ కోసం నిజామాబాద్ ఆసుపత్రికి గత నెల 21వ తేదీన తీసుకెళ్ళారు.

మత్తు మందు ఇచ్చాక.... సిజేరియన్ శస్త్రచికిత్స చేసే సమయంలో పుట్టే బాబు అవయవాలు బయటకు వచ్చాయి. దీంతో వారు సర్జరీ చేయకుండా హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు.... శిశువు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.

ఇక్కడి వైద్యులు సైతం తాము ఆపరేషన్ చేయమని, నార్మల్ డెలివరీ చేస్తామనడంతో మానస మానసిక క్షోభకు గురైంది. కుమిలి కుమిలి ఏడ్చింది.... స్పృహ తప్పి పడిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో మానసకు సీజేరియన్ చేసి బాబును బయటకు తీశారు... 

అయితే మానస పరిస్థితి రోజు రోజుకు విషమించడంతో నీలోఫర్ ఆసుపత్రిలో డాక్టర్లు చేతులెత్తేసారు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ కార్యదర్శి.... మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి వెంటనే స్పందించారు.

విషయాన్ని సీఎంవో ఓఎస్డి,  వైద్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మానసను ఫిబ్రవరి 28న ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మానస ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.

ఆమెకు మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మార్చి 1న నిమ్స్‌కి తరలించారు. ఈ సందర్భంగా వెంటిలెటర్‌పైనే దాదాపు పదిరోజుల పాటు ప్రాణాలతో పోరాడింది మానస.

అయితే వైద్యుల కృషితో ఆమె ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆరోగ్యం కుదటపడటంతో నిన్న రాత్రి నిమ్స్ నుంచి డిశ్చార్జ్ చేశారు. తల్లి ఒడి కోసం... 22 రోజులుగా తల్లడిల్లుతున్న మానస కుమారుడు తల్లి ఒడిని చేరాడు. బిడ్డను చూసుకున్న మానస సంతోషం వ్యక్తం చేసింది. 

అయితే మానస గర్భం దాల్చిన సమయంలో సోకిన ఓ వ్యాధి వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో కోవిడ్ విజృంభిస్తుండటంతో ఆమె ఆరోగ్యం దృష్ట్యా డిశ్చార్జి చేయడమే మంచిదని భావించి నిర్ణయించారు.

రెండు వారాల తరువాత నిమ్స్ ఆసుపత్రికి పరిశీలన కోసం తీసుకురావాల్సిందిగా కుటుంబసభ్యులకు సూచించారు. మానస ప్రాణాలను నిలబెట్టిన ప్రభుత్వానికి, ఉస్మానియా వైద్యులకు ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.