వైఎస్, చంద్రబాబు, జగన్‌లకు లొంగిపోయారు .. ఏపీ జలదోపిడీపై నోరెత్తలేదు : కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఆగ్రహం
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌లపై మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గతంలో కృష్ణానదిపై కట్టిన ప్రాజెక్ట్‌లపై ఆధిపత్యం తెలంగాణ చేతిలో వుండేదని.. కానీ వైఎస్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయి జలదోపిడీకి సహకరించారని సీఎం ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌లపై మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి మీద కట్టిన ప్రాజెక్ట్‌లు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే వుందన్నారు. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆర్ చెప్పారని.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్‌పై వేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వేశారు. కృష్ణానదిలోని 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలనే దానిపై కేంద్రం కమిటీ వేసిందని.. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇస్తున్నట్లు ప్రతిపాదించారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
దీనికి కేసీఆర్ అంగీకరించి ఏపీకి ఎక్కువ నీరు వెళ్లేలా చేశారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రాజెక్ట్‌లపై కేసీఆర్ పార్లమెంట్‌లో ప్రశ్నించలేదని.. ఇప్పుడు మాత్రం కృష్ణా నదీ జలాల్లో 50 శాతం వాటా కావాలని అడుగుతున్నారని సీఎం ఫైర్ అయ్యారు. కృష్ణా నదిపై వున్న 15 ప్రాజెక్ట్‌లను కేంద్రానికి ఇస్తున్నట్లు 2022లో సంతకాలు చేశారని.. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నిర్వహణకు ఈ బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించారని రేవంత్ రెడ్డి తెలిపారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి తరలింపుకు జగన్ ప్రయత్నిస్తున్నాని.. రోజుకు 8 టీఎంసీలను ఏపీకి తరలించడానికి కేసీఆర్ పర్మిషన్ ఇచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు కూడా గతంలో మచ్చుమర్రి ద్వారా 800 అడుగుల వద్ద నీటిని తరలించడానికి కేసీఆర్ సహకరించారని రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో కృష్ణానదిపై కట్టిన ప్రాజెక్ట్‌లపై ఆధిపత్యం తెలంగాణ చేతిలో వుండేదని.. కానీ వైఎస్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయి జలదోపిడీకి సహకరించారని సీఎం ఆరోపించారు.
సమైక్య రాష్ట్రంలో కంటే ఎక్కువ నిర్లక్ష్యం కేసీఆర్ హయాంలోనే జరిగిందని రేవంత్ దుయ్యబట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయి వుంటే 10 లక్షల ఎకరాలకు నీరు అందేదన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌ను ఏపీ ఆక్రమిస్తే కేసీఆర్ స్పందించలేదని.. సాగునీటి ప్రాజెక్ట్‌లపై రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిద్దామన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌లపై శ్వేతపత్రం విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.