Medaram Jatara 2024: ఆన్‌లైన్ ద్వారా సమ్మక్క–సారలమ్మలకు ‘బంగారం’.. నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్
Medaram Jatara 2024: తెలంగాణా మహా కుంభమేళా… మేడారం సమ్మక్క, సారలమ్మ సందర్భంగా గిరిజన దేవతలైన మేడారం, సమ్మక్క, సారలమ్మలకు బంగారం (బెల్లం) సమర్పించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆన్‌లైన్‌లో ప్రారంభించారు.
Medaram Jatara 2024: తెలంగాణా మహా కుంభమేళా… మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర..! ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగే ఈ జనజాతరకు కోటి మంది వస్తారని అంచనా. ములుగు జిల్లా మేడారంలో ప్రతి రెండేళ్ళకుఒకసారి జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర ఆసియా లోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్దినొందింది. కాగా.. ఈ జాతరకు పురస్కరించుకుని ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రేవంత్‌రెడ్డి తన మనవడు రియాన్ష్ పేరుతో నిలువెత్తు బంగారం ఆన్‌లైన్ ద్వారా సమర్పించారు.
అలాగే.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన మనవరాలి బరువుకు సమానమైన బంగారాన్ని ఆన్‌లైన్ ద్వారా సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల మేడారం జాతరకు హాజరుకాని భక్తులు దేవతలకు బంగారం నైవేద్యంగా సమర్పించేందుకు వీలు కలుగుతుంది. మేడారం జాతరకు బంగారం సమర్పించేందుకు ఆన్లైన్, ఆఫ్లైన్ సేవలను దేవదాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది. మీసేవ, పోస్టాఫీసులతో పాటు ‘టీ-యాప్ ఫోలియో’ యాప్ ద్వారా సేవలు పొందేలా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.