నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి తీపికబురు.. వచ్చే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ

వచ్చే ఏడాది లోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి . విద్యార్ధులు, నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌస్ లో ఉన్నోళ్లు కుల్లుకున్నా.. కడుపులో దుఃఖం పొంగుకొచ్చినా ఉద్యోగాల భర్తీ ఆగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

telangana cm revanth reddy key comments on employment notifications ksp

విద్యార్ధుల బలిదానాల మీదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7,094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ..  స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్‌లో వుందన్నారు. ఆరోగ్య తెలంగాణ నిర్మించడంలో వారిదే కీలకపాత్ర అని.. గడిచిన పదేళ్లలో రాష్ట్రంలోని యువత ఆకాంక్షలు నెరవేరలేదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారి కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఆలోచించిందని రేవంత్ దుయ్యబట్టారు. కుమార్తెను జనం ఓడిస్తే వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, తెలంగాణ కోసం పోరాడిన యువతపై మాత్రం కేసులు పెట్టి వేధించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక నెరవేరుస్తుందని, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా కొత్త ఛైర్మన్‌ను నియమించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది లోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, పేదలకు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్లలో ఆనందం చూస్తామన్నారు. త్వరలోనే 15 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 

వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే మీకు ఉద్యోగాలు వచ్చాయని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. మేం ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటే... మా ప్రభుత్వంపై హరీష్ శాపనార్థాలు పెడుతున్నారని సీఎం ఫైర్ అయ్యారు. పిల్లి శాపనార్ధాలకు ఉట్టి తెగిపడదని, అవాకులు చెవాకులు పలకడం కాదు... ఒక్కసారి ఇక్కడున్న పేదోళ్ల బిడ్డల కళ్లలో ఆనందం చూడాలని ముఖ్యమంత్రి హితవు పలికారు. కేసీఆర్ గారు.. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టాలంటూ సీఎం చురకలంటించారు. విద్యార్ధులు, నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌస్ లో ఉన్నోళ్లు కుల్లుకున్నా.. కడుపులో దుఃఖం పొంగుకొచ్చినా ఉద్యోగాల భర్తీ ఆగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios