విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు - 2020పై రాష్ట్రాల అభిప్రాయాలను తెలుపాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో మోడీకి లేఖ రాసిన సీఎం సదరు బిల్లుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మోడీ సర్కార్ ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల విద్యుత్ సవరణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read:ఆరేళ్ల తెలంగాణ వెనుక ఆరు దశాబ్దాల ప్రయాణం..

రాష్ట్రాలు తమకున్న అధికారాలు కోల్పోయేలా విద్యుత్ సవరణ బిల్లు ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. జాతీయ పునరుత్పాదక శక్తి పాలసీలో మార్పులు చేసే ముందు రాష్ట్రాలను సంప్రదించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ప్రత్యేక పరిస్ధితులు ఉంటాయని, వాటికి అనుగుణంగా మార్పులు చేసుకునే అవకాశం రాష్ట్రాలకు ఉండాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లులో ప్రస్తుతం సబ్సిడీ పొందుతున్న రైతులు, గృహ వినియోగదారులకు నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు.