Asianet News TeluguAsianet News Telugu

మోడీ గారు .. మీ వాళ్లని ఆపండి, ఇక చూస్తూ ఊరుకునేది లేదు : కేసీఆర్ అల్టీమేటం

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దుర్మార్గాలను అడ్డుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన విజ్ఞప్తి చేశారు. ఎంత శక్తివంతుడైనా వెయ్యేళ్లు బతకరని.. మీ పేరు, మీ హోంమంత్రి పేరుతో వీళ్లు దుర్మార్గాలు చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. 
 

telangana cm kcr warns pm narendra modi over mlas poaching issue
Author
First Published Nov 3, 2022, 9:58 PM IST

మోడీ గారు.. మీరు ప్రధాని అయినప్పుడే తాను ముఖ్యమంత్రి అయ్యానని కేసీఆర్ అన్నారు. ఈ దుర్మార్గాన్ని ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది మీకు శోభనివ్వదని.. మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలని సీఎం హితవు పలికారు. ఇందులో బాధ్యులైన వారందరినీ శిక్షించాలని ఆయన కోరారు. ప్రభుత్వాలను కూల్చి మీరు ఏం సాధించాలనుకుంటున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ఎంత శక్తివంతుడైనా వెయ్యేళ్లు బతకరని.. మీ పేరు, మీ హోంమంత్రి పేరుతో వీళ్లు దుర్మార్గాలు చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. 

వీళ్లని ఆపాలని.. వీళ్లు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. రాష్ట్రాల అభివృద్ధికి ఆటంకంగా మారారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎప్పుడెప్పుడు.. ఎక్కడెక్కడ ఎలాంటి ఆపరేషన్లు చేపట్టారో వీడియోలో చెప్పారని సీఎం దుయ్యబట్టారు. చార్టెడ్ విమానాల్లో తిరుగుతూ అన్నీ చక్కబెడతామని చెప్పారని కేసీఆర్ తెలిపారు. దేశంలో ఎన్నో అత్యుత్తమ తీర్పులు వచ్చాయని.. ఈ దోషులను శిక్షించి దేశాన్ని రక్షించాలని , ఈ విషయంలో తాము చూస్తూ ఊరుకోమని కేసీఆర్ హెచ్చరించారు. మా చేతికి అందిన సమాచారాన్ని అందరికీ పంపించామని... రేపటి నుంచి వందల మంది సమాచారాన్ని విశ్లేషించే పనిలో వుంటారని సీఎం తెలిపారు. 

Also REad:దొరికిన దొంగలు వీళ్లే : ఒక్కొక్కడికి మూడు నాలుగు ఆధార్లు, పాన్ కార్డులు ... చిట్టా విప్పిన కేసీఆర్

హైదరాబాద్ వచ్చి తన ప్రభుత్వాన్నే కూల్చుతామంటే నేను ఊరుకోవాలా అంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చితే పార్టీలకు అతీతంగా పోరాటం చేశామని సీఎం గుర్తుచేశారు. ఐతే గోడీ, లేదంటే ఈడీ అని అంటున్నారని.. కర్ణాటకలో ఎమ్మెల్యేలను ఎలా తరలించారో వాళ్లు చెబుతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను కూలీలుగా ఎలా తరలించామో చెప్పారని.. వీడియోల్లో అమిత్ షా పేరు 20 సార్లు చెప్పారని సీఎం తెలిపారు. ప్రధాని మోడీ పేరు కూడా ఒకటి రెండు సార్లు చెప్పారని కేసీఆర్ చెప్పారు. న్యాయవ్యవస్థకు దండంపెట్టి కోరుతున్నానని.. దేశం ప్రమాదంలో పడ్డప్పుడు న్యాయవ్యవస్థే కాపాడిందని సీఎం గుర్తుచేశారు. 

నేరస్తులు ఎవరైనా శిక్ష పడాలి అని కేసీఆర్ అన్నారు. వీళ్ల ఫోన్లను పోలీసులు సీజ్ చేసి కాల్ డేటా అంతా తీశారని సీఎం చెప్పారు. వీళ్లు ఎవరెవరితో మాట్లాడారో ఆ చరిత్రంతా వచ్చిందని.. ఆ వివరాలు అంతా 70, 80 వేల పేజీలు అవుతాయన్నారు. వాళ్ల కాల్ డేటా వేల పేజీల్లో వుందని.. నిజమైన దొంగలు దొరికే వరకు అందరూ పరిశోధించాలని సీఎం పేర్కొన్నారు. అందుకే అన్ని న్యూస్ ఏజెన్సీలకు ఆ వివరాలు పంపించానని ... దీనిపై అంతా కలిసి యుద్ధం చేయాల్సిందేనని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలు, మేధావులేనని కేసీఆర్ పిలుపునిచ్చారు. కుట్రను బద్ధలు కొట్టాని తమ ఎమ్మెల్యేలు డిసైడ్ అయ్యారని.. అందుకే వారి రహస్యాలు బట్టబయలు అయ్యాయని సీఎం అన్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలను ఎలా కూల్చామో చెబుతున్నారని కేసీఆర్ వెల్లడించారు. ఈడీ, ఐటీ కూడా మీపైకి రాదని చెబుతున్నారని ... అలా చెప్పడానికి వీరెవరని సీఎం ప్రశ్నించారు. ప్రలోభాలు పెట్టేందుకు 24 మంది వున్నారని.. ఈ దొంగల ముఠాకు డబ్బు ఎవరిస్తున్నారని కేసీఆర్ నిలదీశారు. ఓ కేంద్ర మంత్రి మీరు ఎమ్మెల్యేలను కొనలేదా అంటున్నారని.. తాము 88 సీట్లు గెలిచామని, మూడింట రెండోవంతు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే వాళ్లను కలుపుకున్నామని ఆయన పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios