జగిత్యాల: కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ఏడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నింపుతామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పనులను మంగళవారం పరిశీలించిన సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద నిర్మిస్తున్న పంపుహౌజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 

రాంపూర్ వద్ద నిర్మిస్తున్న ఎనిమిది పంపు హౌజ్ పనులను కేసీఆర్ స్వయంగా సందర్శించారు. పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న లక్ష్మీపూర్ పంపు హౌజ్ ద్వారా వరద కాలువ నుండి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రివర్స్ పంపింగ్ ద్వారా నీరందించాలని కేసీఆర్ గతంలో నిర్ణయించారు. 

అందులో భాగంగా ఎస్ఆర్ ఎస్పీ పునరుజ్జీవ పథకం చేట్టారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల ద్వారా లక్ష్మీపూర్ నుండి రాంపూర్ వరకు చేరుకునే నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా  వరద కాలువ నుంచి ఎస్ఆర్ఎస్పీకి పంపుతారు.    

ఈ ఏడాది జూలై నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నందున అటు మిడ్ మానేరుకు, ఇటు ఎస్ఆర్ఎస్పీకి నీటి పంపింగ్ జరగాలని ఆదేశించారు. నెల రోజుల్లో రాంపూర్ పంపు హౌజ్ లోని ఎనిమిది పంపుల్లో అయిదు పంపులను సిద్ధం చేయాలని, ఆగష్టు నాటికి మిగిలిని మూడు పంపులను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. 

అందుకు అవసరమైన విద్యుత్ సరఫరా ఏర్పాట్లు కూడా చూడాలని తెలిపారు. గోదావరి నదిలో అక్టోబర్, నవంబర్ నెల వరకు కూడా నీటి ప్రవాహం ఉంటుందని అప్పటి వరకు ఎస్ఆర్ ఎస్పీకీ నీటి పంపింగ్ జరుగుతూ ఉండాలని సూచించారు. 

ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రెండో పంటకు ఈ ఏడాదే నుంచే నీరు అందించడం లక్ష్యంగా పనిచేయాలని కేసీఆర్ కోరారు. రేయింబవళ్లు పనిచేసి లక్ష్యం సాధించాలని వర్క్ ఏజేన్సీలకు సూచించారు. 
తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా రైతులు కోటీ ఆశలతో కాళేశ్వరం నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారన్న కేసీఆర్ దశాబ్దాల తరబడి అనుభవించిన సాగునీటి కష్టాలకు తెరపడుతుందని నమ్మకంతో ఉన్నారని తెలిపారు. 

రైతులకు సాగునీరందించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుందన్నారు. కోటికి పైగా ఎకరాలకు సాగునీరందించేందుకు పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ ఎత్తపోతల పథకాలను నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

ఈ ప్రాజెక్టులలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదన్నారు. దాదాపు 80శాతం జిల్లాలకు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీరందించే బృహత్తర ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును అభివర్ణించారు కేసీఆర్. ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. 

రైతులు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న కలలను సాకారం చేసేందుకే ఎక్కడా నిధుల కొరత రాకుండా, భూసేకరణ సమస్య లేకుండా, విధాన నిర్ణయాల్లో జాప్యం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

కాళేశ్వరం వంటి అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణానికి కనీసం 15 నుంచి 20 ఏళ్లు పడుతుందని కానీ తెలంగాణ ప్రభుత్వం అతి తక్కువ సమయంలోనే అంటే రెండున్నరేళ్లకే పూర్తి చేసి చరిత్ర సృష్టించబోతుందన్నారు. 

జూన్ నెల నుంచే నీటి పంపింగ్ ప్రారంభించాల్సి ఉందని అందువల్ల అధికారులు, ఇంజనీర్లు, వర్క్ ఏజెన్సీలు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉందో గ్రహించి అధికారులు, వర్క్ ఏజెన్సీలు కూడా ప్రాణం పెట్టి పనిచేయాలని కోరారు. 

ప్రాజెక్టు పూర్తికానున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పుకొచ్చారు. ఒకసారి నీటి పంపింగ్ ప్రారంభమైతే కొన్ని బాలారిష్టాలు ఎదురవ్వడం సహజమని వాటిని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ప్రాజెక్టును పటిష్టంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో దానిని నిర్వహించడం కూడా అంతే ముఖ్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. 

ఇకపోతే పంపు హౌజ్ పరిశీలనకు ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ గోదావరి నది పరివాహక ప్రాంతాలపై, బ్యారేజ్  లపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ముఖ్యమంత్రితో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు రెండు హెలికాప్టర్లలో  పర్యటించారు.  

శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకంలో భాగంగా నిర్మిస్తున్న రాంపూర్ పంపుహౌజ్ పనులు వేగంగా పూర్తిచేసేందుకు స్వయంగా పర్యవేక్షించాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సిఎం కేసిఆర్ బాధ్యతలు అప్పగించారు.