Asianet News TeluguAsianet News Telugu

నేడు యాదాద్రికి కేసీఆర్:1.16 కిలోల బంగారం విరాళంగా ఇవ్వనున్న సీఎం

తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు యాదాద్రికి వెళ్లనున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. .యాదాద్రి లక్ష్మి నరసింహస్వామికి 1.16 కిలోల బంగారం విరాళంగా ఇవ్వనున్నారు. 
 

Telangana CM KCR To Visit Yadadri Temple Today
Author
First Published Sep 30, 2022, 9:44 AM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్  శుక్రవారం నాడు యాదాద్రికి వెళ్లనున్నారు. సతీసమేతంగా కేసీఆర్ యాదాద్రికి రోడ్డు మార్గంలో వెళ్తారు. సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.దసరా రోజున జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో ఇవాళ కేసీఆర్ యాదాద్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం  1.16 కిలోల బంగారాన్ని కేసీఆర్ విరాళంగా అందించనున్నారు.  ఆలయ గోపురం స్వర్ణ తాపడం కోసం బంగారం విరాళంగా ఇవ్వాలని కేసీఆర్ కోరారు. దీంతో పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు బంగారం విరాళం ఇస్తామని ప్రకటించారు. కేసీఆర్ కూడా 1.16 కిలోల బంగారం విరాళంగా ఇవ్వనున్నట్టుగా ప్రకటించారు. ఈ బంగారాన్ని ఇవాళ కేసీఆర్ ఆలయ అధికారులకు అందించనున్నారు. ఆలయానికి చేరకున్న తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కేసీఆర్. పూజలు నిర్వహించిన తర్వాత బంగారాన్ని ఆలయ అధికారులకు అందిస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని పరిశీలిస్తారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పత్రాలతో సీఎం కేసీఆర్ పూజలు నిర్వహిస్తారని సమాచారం. 

దసరా రోజున తెలంగాణ సీఎం కేసీఆర్  జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. దసరా రోజున టీఆర్ఎస్ శాసనసభపక్షంతో పాటు పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జాతీయ పార్టీ ఏర్పాటు విషయమై కేసీఆర్  ప్రకటన చేసే అవకాశం ఉంది. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైందనే ప్రచారం కూడా సాగుతుంది.  దసరా రోజున పలు పార్టీల నేతలకు కూడా  కేసీఆర్ ఆహ్వానం పలికారని సమాచారం. 

also read:టీఆర్ఎస్ కు రూ.80కోట్లతో సొంత చార్టర్డ్ ఫ్లైట్.. దేశవ్యాప్త సుడిగాలి పర్యటనకు కేసీఆర్ రెడీ..

2024 లో జరిగే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కానుందని కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు. ఇందు కోసం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు చెందిన నేతలు, సీఎంలతో చర్చిస్తున్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసే జాతీయ పార్టీపై కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.బీజేపీకి పరోక్షంగా సహయపడే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసి ఏం చేస్తారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios