Asianet News TeluguAsianet News Telugu

రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మంగళవారం (జనవరి 18) ఉమ్మడి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో ఆకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. 

Telangana CM KCR to visit warangal district tomorrow
Author
Hyderabad, First Published Jan 17, 2022, 5:26 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మంగళవారం (జనవరి 18) ఉమ్మడి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో ఆకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.  వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సీఎంతో పాటు పర్యటనలో పాల్గొననున్నారు. ఇక, కేసీఆర్ అధ్యక్షతన నేటి కేబినెట్ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లపై కూడా చర్చ సాగింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు తుదిదశకు చేరిందన్న అధికారులు సీఎంకు తెలిపారు. వర్షాలతో కొన్ని జిల్లాల్లో కొనుగోళ్లు ఆలస్యమైందని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేవరకు కేంద్రాలను కొనసాగించాలని ఆదేశించారు. 

హన్మకొండ జిల్లాలోని (Hanamkonda district) పరకాల నియోజకవర్గంలో (parakala constituency) కేసీఆర్ పర్యటన సాగనుంది. ఆకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలం, నడికూడ మండలంలో అకాల వర్షానికి పంట నష్టం జరిగిన విషయాన్ని జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి , నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలు.. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తాను స్వయంగా పంట నష్టం జరిగిన పంట పొలాల దగ్గరకు వస్తానని చెప్పారు. 

ఇక, ఇటీవల కురిసిన వడగళ్ల వానతో హన్మకొండ జిల్లాలోని పలుచోట్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. జొన్న, మిరప, కూరగాయల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురు గాలులు, వడగళ్లకు కోత దశలో ఉన్న మొక్కజొన్న నేలవాలింది. వడగళ్లతో మిర్చి పూత, ఆకులతో సహా రాలిపోయాయి. కొన్నిచోట్ల కంకి దశలో ఉన్న మొక్కజొన్న పూర్తిగా నేలమట్టం అయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios