తెలంగాణలో బసవేశ్వరుడి జయంత్యుత్సవాలకు సీఎం కేసీఆర్ సారథ్యం వహిస్తున్నారు. నేడు రాజధాని నగరంలోని రవీంద్రభారతిలో బసవేశ్వరుడి జయంతి వేడుక అధికారికంగా జరుగుతుంది. ఇదే సందర్భంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రావడం.. అందులో బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి వెళ్లాలనే ఆలోచనలు చేస్తుండటంతో బసవ జయంతిపై ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్: ఈ రోజు (23వ తేదీన) 12వ శతాబ్ది సంఘ సంస్కర్త మహాత్మ బసవేశ్వరుడి జయంతి. ఈ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ సారి సీఎం కేసీఆర్ సారథ్యంలో రవీంద్ర భారతిలో 890వ బసవేశ్వర జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. బసవ జయంతి అధికారిక వేడుక అని సీఎం కేసీఆర్ 2014లోనే ప్రకటించారు.
బసవేశ్వరుడి జయంత్యుత్సవాలకు కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు వీ శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఇతరులు పాల్గొంటారు.
మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాలను తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్‌తో కలిసి నిర్వహిస్తారు.
బసవేశ్వరుడి జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఓ బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. మోండా మార్కెట్ నుంచి ట్యాంక్ బండ్ మీదున్న బసవేశ్వర విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహిస్తారు.
Also Read: శత్రువులను పులులకు ఆహారంగా వేశారు.. మిరపకాయలతో టార్చర్ పెట్టారు.. ఆ డ్రగ్స్ ముఠా దారుణాలు
12వ శతాబ్దికి చెందిన సంస్కర్త బసవేశ్వరుడికి కర్ణాటకలో విశేష ఆధరణ ఉన్నది. బసవేశ్వరుడి మార్గాన్ని అనుసరిస్తున్న వర్గం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్నారు. ఈ ఏడాది బసవేశ్వరుడి జయంత్యుత్సవాల సందర్భంలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి వెళ్లుతున్నదన్న నేపథ్యంలో ఈ జయంత్యుత్సవాలపై ఆసక్తి నెలకొంది.
కర్ణాటకలో తెలుగు ప్రజలను ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ పార్టీ జేడీఎస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తున్నది. తెలుగు ఓటర్లతోపాటు లింగాయత్‌లలోనూ బీఆర్ఎస్ తన పట్టును పెంచుకోవడానికి ఇది పురికొల్పుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకున్నా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేరుగా రంగంలోకి దూకాలనే ఆలోచనలో ఉన్నట్టు అర్థం అవుతున్నది.
ఎన్నికల కోసం కాకుండా.. అసలు వేరే రాష్ట్రాల్లో పోటీ చేయాలనే ప్రకటన చేయకముందే అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం బసవేశ్వరుడి జయంతిని అధికారిక పండుగగా ప్రకటించడం గమనార్హం.
