కొత్త అజెండాతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వుందని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆ ఆలోచనలను శరద్ పవార్‌తో పంచుకున్నానని కేసీఆర్ తెలిపారు. పవార్‌కు ఎంతో రాజకీయ అనుభవం వుందని.. అంతా కలిసి త్వరలో సమావేశమవ్వాలని నిర్ణయించామన్నారు. 

తెలంగాణ ఏర్పాటులో (telangana formation) శరద్ పవార్ (sharad pawar) ఇచ్చిన మద్ధతు మరువలేనిదన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) . ఆదివారం మహారాష్ట్ర పర్యటనలో భాగంగా శివసేన (shivsena) అధినేత , సీఎం ఉద్ధవ్ థాక్రేతో (uddhav thackeray) భేటీ అయిన అనంతరం నేరుగా ఎన్సీపీ చీఫ్ ఇంటికి కేసీఆర్ వెళ్లారు. సమావేశం ముగిసిన తర్వాత గులాబీ బాస్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో పాలన సరైన రీతిలో సాగడం లేదన్నారు. కొత్త అజెండాతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వుందని ఆయన పేర్కొన్నారు. ఆ ఆలోచనలను శరద్ పవార్‌తో పంచుకున్నానని కేసీఆర్ తెలిపారు. పవార్‌కు ఎంతో రాజకీయ అనుభవం వుందని.. అంతా కలిసి త్వరలో సమావేశమవ్వాలని నిర్ణయించామన్నారు. కలసివచ్చే వారందరితో మీటింగ్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. 

అంతకుముందు ఉద్ధవ్ థాక్రేతో (uddhav thackeray) సమావేశమైన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించామని కేసీఆర్ తెలిపారు. త్వరలో హైదరాబాద్‌లో అందరం కలిసి .. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్ట్‌లతో తెలంగాణ స్వరూపం మారిపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

రెండు రాష్ట్రాల సంబంధాలు, పరస్పర సహకారంపైనా చర్చించామని సీఎం తెలిపారు. దేశంలో మార్పు రావాలని.. దేశాన్ని బలోపేతం చేయాలని తాము కోరుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో కలిసి వచ్చే వారిని కలుపుకుని పోతామని సీఎం వెల్లడించారు. శివాజీ ప్రేరణతో ముందుకు సాగుతామని.. హైదరాబాద్ రావాలని ఉద్ధవ్ థాక్రేను ఆహ్వానిస్తున్నానని కేసీఆర్ చెప్పారు. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని.. తెలంగాణతో మహారాష్ట్రకు వెయ్యి కిలోమీటర్ల సరిహద్దు వుందన్నారు. 

అంతా కలిసి ఓ మార్గాన్ని నిర్దేశించుకుంటామని.. మా సమావేశంతో ఇవాళ తొలి అడుగు పడిందని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరు మారాలని సీఎం వ్యాఖ్యానించారు. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. రెండు రాష్ట్రాలు మంచి అవ‌గాహ‌న‌తో ముందుకు న‌డ‌వాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. 75 ఏండ్ల స్వాతంత్ర్యం త‌ర్వాత కూడా దేశంలో అనేక స‌మ‌స్య‌లు నెల‌కొన్నాయి అని సీఎం కేసీఆర్ తెలిపారు.

అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్ర, తెలంగాణ సోదర రాష్ట్రాలని వ్యాఖ్యానించారు. ఈ రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం వుందన్నారు. అన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చామని థాక్రే అన్నారు.