తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిస్కరించారు.

అంతకు ముందు గన్‌పార్క్‌‌‌లోని అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతిపథంలో దూసుకుపోతోందని.. ప్రజలు తమ మీద పెట్టుకున్న ఆశలను నెరవేరుస్తున్నామన్నారు.

ప్రతి ఎన్నికల్లో విజయాన్ని కట్టబెడుతూ.. తమకు కొండంత బలాన్ని ఇస్తున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం నేడు బలమైన ఆర్ధిక శక్తిగా ఎదిగిందని.. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను ఐదేళ్లలో పరిష్కరించామని ఆయన గుర్తు చేశారు.

అసాధ్యమనుకున్న రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. అతి తక్కువ సమయంలోనే కరెంట్ సమస్యలను అధిగమించామని సీఎం తెలిపారు. దేశంలో 24 గంటలు నిరంతరం విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని వెల్లడించారు.

తాగునీటి సమస్యను రాష్ట్రం నుంచి తరిమేశామని, మిషన్ భగీరథ పనులు దాదాపు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై నాటికి గ్రామాలలో 100 శాతం భగీరథ పనులు పూర్తవుతాయని కేసీఆర్ తెలిపారు.

గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేశామని, వ్యవసాయ అనుబంధ వృత్తులను ప్రోత్సహిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. మన పథకాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించిందని ఆయన గుర్తు చేశారు.

పథకాలు రైతులకు కొండంత ధైర్యాన్నిస్తున్నాయని, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా క్రాఫ్ కాలనీలు ఏర్పాటు చేయబోతున్నామని సీఎం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని, 33 శాతం పచ్చదనాన్ని పెంచే లక్ష్యంగా హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు.

భవిష్యత్తులో పంచాయతీలకు నిధుల కొరత ఉండదని.. రెవెన్యూ చట్టాన్ని ప్రక్షాళన చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టం అమలుకు ప్రజల సహకారం అవసరమని, అవినీతికి అడ్డుకట్ట వేస్తూ పారదర్శక పాలనలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలన్నారు. ధనవంతులైన రైతులు తెలంగాణలో ఉన్నారనే పేరు రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.