ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణలో కరెంట్ పోదని.. విద్యుత్ శాఖ ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకున్నామన్నారు. 

జనగామ ప్రాంతాన్ని చూసినప్పుడల్లా జయశంకర్ సార్ దు:ఖపడేవారని తెలంగాణ ముఖ్యమంత్రి (telangana cm) కేసీఆర్ (kcr) అన్నారు. జనగామ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌ నుంచి శుక్రవారం జనగామ వచ్చిన కేసీఆర్ కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డితో కొబ్బరికాయ కొట్టించారు సీఎం. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఊరంతా వెళ్లిపోతే ముసలివాళ్లు మాత్రమే అక్కడ మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బచ్చన్నపేటలో ఒకనాడు వరుసగా 8 ఏళ్లు కరువొచ్చిందని.. ఆ దృశ్యం చూసి తనకు దుఖమొచ్చిందని కేసీఆర్ గుర్తుచేశారు. పట్టుబట్టి, జట్టుకట్టి దేవాదుల పూర్తి చేసుకుని నీళ్లు తెచ్చుకున్నామని సీఎం వెల్లడించారు. మొండిపట్టుదలతో , మీ అందరి దీవెనతో ముందుకు వెళ్లామని కేసీఆర్ తెలిపారు. ఏడేళ్ల క్రితం మనం ఎక్కడ వున్నాం.. ఇవాళ ఎక్కడికి చేరుకున్నామని సీఎం ప్రశ్నించారు. ఆనాడు అనేక రకాల అపోహలు.. అయ్యేదా, పొయ్యేదా అన్నారని కేసీఆర్ గుర్తుచేశారు. సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకుంటున్నామని సీఎం తెలిపారు. 

ఈ ధనం, ఈ సౌభాగ్యం రావడానికి ఎంతో మంది కృషి వుందని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఇంకా అభివృద్ధిని సాధిస్తుందని సీఎం జోస్యం చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఈ స్థాయి వసతులున్న కలెక్టరేట్ లేదని కేసీఆర్ పేర్కొన్నారు. జనగామలో మూడేకరాలు వున్నోళ్లు కోటీశ్వరుడని.. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకున్నామని కేసీఆర్ తెలిపారు. ఉద్యోగులకు జీతాలు ఇంకా పెరుగుతాయని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణలో కరెంట్ పోదని.. విద్యుత్ శాఖ ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారని కేసీఆర్ ప్రశంసించారు. 

11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వచ్చి ఇక్కడి అభివృద్దిని చూశారని ఆయన తెలిపారు. దేశంలో పది గ్రామాలకు అవార్డులు వస్తే అందులో ఏడు గ్రామాలు మనవేనని కేసీఆర్ వెల్లడించారు. పట్టుదలతో చేస్తేనే ఇవన్నీ సాధ్యమైందన్నారు. జిల్లాల విభజన అర్ధవంతంగా , (telangana new districts) ఆలోచించి చేశామని కేసీఆర్ గుర్తుచేశారు. భూపాలపల్లి , ములుగు జిల్లాల ఏర్పాటులో ఎంతో కసరత్తు చేశామని సీఎం తెలిపారు. త్వరలో తలసారి ఆదాయం రూ.2.70 లక్షలకు పెరుగుతుందని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లో 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారని.. ఢిల్లీ, ముంబై నుంచి వచ్చి హైదరాబాద్‌లో కొంటున్నారని సీఎం తెలిపారు. 

రైతే వెన్నెముక అంటారు గానీ, రైతులకు కూర్చొనే జాగా లేదని, ఇష్యూ వుంటే కూర్చొని మాట్లాడుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ బిల్డింగ్ నమూనా రూపొందించిన ఆర్కిటెక్ట్‌ని కేసీఆర్ అభినందించారు. 32 గ్రోత్ సెంటర్లలో అభివృద్ధి పరిమళాలు వెదజల్లాలని.. జోనల్ వ్యవస్థతో అందరికీ న్యాయం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. అవగాహన లేక కొందరు వ్యతిరేకించారని ఆయన మండిపడ్డారు. 

ఏపీతో కలిసి ఉన్నన్ని రోజులు అనేక రకాలుగా బాధపడ్డామన్నారు. అటవీ కాలేజీని పెట్టుకున్నామని.. త్వరలో యూనివర్సిటీ రాబోతోందని సీఎం చెప్పారు. రాష్ట్రం ఏర్పడితే కరెంట్ రాదని కట్టెపట్టుకుని చెప్పిన నాయకులంతా ఇవాళ నివ్వెరపోయారని కేసీఆర్ అన్నారు. మారుమూల ప్రాంతాలు అభివృద్ధి అయినప్పుడే బంగారు తెలంగాణ అని సీఎం వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలకు ఢోకా లేదని.. మౌలిక సదుపాయాల కొరత లేదని కేసీఆర్ తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేస్తున్నారు కాబట్టే ఈ వెలుగులని సీఎం ప్రశంసించారు.