కేసీఆర్ నేషనల్ గేమ్.. తెలంగాణ వెలుపల తొలి అడుగు అక్కడే.. స్పష్టతనిచ్చేసిన బీఆర్ఎస్ అధినేత..!!
జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తున్నారు.
జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలని భావిస్తున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. అయితే తొలుత తన పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం తెలంగాణ వెలుపల తమకు అనుకులమైన ప్రాంతాలపై కేసీఆర్ దృష్టిసారించారు. ఒకప్పుడు నిజాం పాలనలో తెలంగాణతో కలిసి ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలోని పలు ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటకలలో భాగమైన నాందేడ్, ఔరంగాబాద్, పర్భణి, భిర్, ఉస్మానాబాద్, లాతూర్, బీదర్, రాయచూర్, గుల్బర్గా ప్రాంతాలలోని ప్రజలకు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల ప్రజలతో మంచి సంబంధాలే ఉన్నాయి.
జాతీయ పార్టీగా మారాలంటే..
దేశంలో ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. ఈ షరతులకు లోబడి కాలానుగుణంగా.. ఒక పార్టీ జాతీయ పార్టీ హోదాను పొందవచ్చు లేదా కోల్పోవచ్చు. ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా పరిగణించబడలాంటే.. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో గుర్తించబడి ఉండాలి. (లేదా) పార్టీ అభ్యర్థులు గత లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో.. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. గత లోక్‌సభ ఎన్నికల్లో కనీసం నలుగురు ఎంపీలను కలిగి ఉండాలి. (లేదా) మూడు రాష్ట్రాల కంటే తక్కువ కాకుండా లోక్‌సభలోని మొత్తం సీట్లలో కనీసం 2 శాతం సీట్లను గెలుచుకోవాలి.
ఈ నిబంధనలను అనుగుణంగా ఓట్లు, సీట్లు సాధిస్తేనే బీఆర్ఎస్ జాతీయ పార్టీ హోదా పొందగలదు. అందుకే తెలంగాణ వెలుపల మహారాష్ట్ర, కర్ణాటకలోని అనువైన ప్రాంతాలపై దృష్టి సారించి పెద్ద ఎత్తున ఓట్లను సమీకరించడం ద్వారా జాతీయ పార్టీ హోదా పొందాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ వెలుపల మొదటి అడుగు మహారాష్ట్రలో వేయాలని కేసీఆర్ చూస్తున్నారు. మహారాష్ట్రలో ఇటీవలే సర్పంచ్ ఎన్నికలు ముగియగా.. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను నిలిపేందుకు సిద్దమైంది.
పక్కా ప్లాన్‌తో..!
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసి పలు స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా అక్కడ బీఆర్ఎస్‌కు ఆదరణ ఉందనే సంకేతం పంపినట్టుగా అవుతుంది. తద్వారా అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి దింపేలా క్షేత్ర స్థాయిలో కార్యచరణను సిద్దం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ముఖ్యంగా తెలంగాణకు సరిహద్దుల్లో ఉన్న నాందేడ్ జిల్లాలోని కిన్వాట్ వంటి అసెంబ్లీ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్‌సీపీ, కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పొత్తులో ఉన్నాయి. ఈ పొత్తు ఇలాగే కొనసాగితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీల్లోని పలువురు ఆశావహులకు టికెట్లు దక్కే అవకాశం ఉండదు. దీంతో అందులో కొందరినైనా తమ పార్టీ వైపు తిప్పుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
ఇందుకోసమే మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉన్న ప్రాంతాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు.. అక్కడ తెలుగు మాట్లాడే ప్రాంతాలపై దృష్టి సారించారు. మహారాష్ట్రలోని అరిణి-ఖేలాపూర్, భోకర్, వాణి, తర్వ, రాజురా, యవత్మాల్, చంద్రాపూర్, బల్లార్షా, గడ్చిరోలి, అహేరి, జీవితి, ధర్మాబాద్ ప్రాంతాల్లో తెలుగు మాట్లాడేవారి సంఖ్య అధికంగానే ఉంది. ఈ ప్రాంతాల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నారు.
మరోవైపు అలాగే నాగ్‌పూర్, అమరావతి, వర్ధా, రాలేగావ్, ఘతంజీ, వాని, యవత్మాల్, చంద్రాపూర్ వంటి ప్రాంతాల్లో ఆదివాసీలు, లంబాడీ జనాభా కూడా ఎక్కువ ఉంది. అక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వ పథకాలతో పాటు గిరిజనులకు కేసీఆర్ సర్కార్ చేస్తున్న మేలు గురించి వివరించేందుకు ప్రత్యేక కార్యచరణ సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే ఈ పనుల్లో నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. స్థానికులు, రైతు సంఘాలు, ఇతర వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో కూడా తెలంగాణతో సరిహద్దును పంచుకుంటున్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ నిలిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
స్పష్టతనిచ్చేసిన కేసీఆర్..
మహారాష్ట్రలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీపై స్పష్టతనిచ్చేశారు. ఈరోజు నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణలో సంక్షేమ పథకాలు, రైతుల సమస్యలపై గురించి ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణను తాము అభివృద్ది పథంలో నిలిపామని చెప్పారు. అలాగే తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతా రావాలని ఆశిస్తున్నామని తెలిపారు. ఒకప్పుడు తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉండేవని.. ఇప్పుడు 24 గంటలు కరెంటు ఇస్తున్నామని, ఇంటింటికి తాగునీరు, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో సాధ్యమైన పని దేశంలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. మహారాష్ట్రలో అన్ని రకాల వనరులు ఉన్న నీరు కోసం, కరెంట్ కోసం తిప్పలు ఎందుకు పడాలంటూ గళమెత్తారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు రావాలంటే రైతు సర్కార్ రావాలని పిలుపునిచ్చారు. రానున్న పరిషత్ ఎన్నికల్లో రైతులు వారి సత్తా చూపిస్తే.. సర్కార్ వారి వద్దకు దిగివస్తోందని అన్నారు. పరిషత్ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరారు. యుద్దం చేయమని చెప్పడం లేదని.. తెలంగాణలో సాధ్యమైన ప్రగతి దేశంలో ఎందుకు సాధ్యం కాదనేది ఆలోచించాలని అన్నారు. ప్రతి గ్రామానికి బీఆర్ఎస్ వస్తుందని చెప్పారు. 10 రోజుల వ్యవధిలో కమిటీలను ఏర్పాటు చేస్తామని కూడా తెలిపారు. రాబోయే రోజుల్లో మహారాష్ట్రలోని మరిన్ని ప్రాంతాల్లో తాను పర్యటిస్తానని చెప్పారు.