Asianet News TeluguAsianet News Telugu

KCR : ధరణి పోర్టల్‌ వెనుక మూడేళ్ల కష్టం.. బంగాళాఖాతంలో వేస్తారంట : కాంగ్రెస్‌ నేతలపై కేసీఆర్ ఆగ్రహం

తెలంగాణను ఏడిపించిందే కాంగ్రెస్ పార్టీ అంటూ చురకలంటించారు సీఎం కేసీఆర్ . భూ వివాదాలు వుండకూడదని 3 ఏళ్లు కష్టపడి ధరణి తీసుకొచ్చామన్నారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారని, ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయని కేసీఆర్ నిలదీశారు.

telangana cm kcr slams congress party over dharani portal issue ksp
Author
First Published Nov 16, 2023, 6:31 PM IST

తెలంగాణను ఏడిపించిందే కాంగ్రెస్ పార్టీ అంటూ చురకలంటించారు సీఎం కేసీఆర్ . అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పథకాన్ని కలలో కూడా ఎవరూ ఊహించలేదన్నారు. రైతు చనిపోతే వారం రోజుల్లోనే రూ.5 లక్షల బీమా అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన ఎలా వుందో, బీఆర్ఎస్ పాలన ఎలా వుందో బేరీజు వేసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి వచ్చిన దేశాలు అభివృద్ధి చెందాయన్నారు. ప్రజలకు వున్న ఏకైక ఆయుధం ఓటని.. ఓటు వేసే ముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అభ్యర్ధుల గుణగుణాలు చూసి ఓటు వేయాలని.. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని ఆయన అన్నారు. 1969లో 400 మంది తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ కాల్చి చంపిందని కేసీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో పరిస్థితులు ఎలా వుండేవో ప్రజలు ఆలోచించాలని సీఎం పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ హయాంలో సాగు, తాగునీటి, కరెంట్ కష్టాలు వుండేవని కేసీఆర్ చురకలంటించారు. కాంగ్రెస్ హయాంలో రూ.200 పింఛను వుండేదని.. వందల్లో వున్న పింఛన్‌ను వేలల్లోకి పెంచామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటిపై పన్ను రద్దు చేశామని కేసీఆర్ వెల్లడించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. రైతుబంధు వస్తుందని ఎవరైనా ఊహించారా అని సీఎం ప్రశ్నించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని విశ్వసించామని.. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయని కేసీఆర్ పేర్కొన్నారు. 

Also Read: K ChandraShekar Rao : రైతుబంధు పుట్టించిందే నేను.. రూ.16 వేలు కావాలా , వద్దా : కేసీఆర్ వ్యాఖ్యలు

రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని.. రైతుబంధు దుబారానో , కాదో ప్రజలు ఆలోచించాలని సీఎం పిలుపునిచ్చారు. రైతుబంధు రూ.16 వేలకు పెరగాలంటే బీఆర్ఎస్ గెలవాలని ఆయన తెలిపారు. 24 గంటల కరెంట్ వృథా అని రేవంత్ రెడ్డి అంటున్నారని, రైతులకు 3 గంటల కరెంట్ చాలు అని అంటున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. రైతులు 10 హెచ్‌పీ మోటార్లు వాడాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, రైతులకు 10 హెచ్‌పీ మోటార్లు వాడే సామర్ధ్యం వుంటుందా అని సీఎం ప్రశ్నించారు. 

ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్ గాంధీ అంటున్నారని, ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా, ధాన్యం డబ్బులు ఎలా వస్తాయని కేసీఆర్ నిలదీశారు. భూ వివాదాలు వుండకూడదని 3 ఏళ్లు కష్టపడి ధరణి తీసుకొచ్చామన్నారు. దరఖాస్తు పెట్టకుండానే రైతులకు నగదు ఖాతాల్లో జమ అవుతుందని.. కాంగ్రెస్ హయాంలో మంజీరా, హల్దీ నదులు ఎలా వుండేవని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుతం మంజీరా, హల్దీ నదులు జీవ నదుల్లా వున్నాయని సీఎం తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios