Telangana Polls 2023 : కాంగ్రెస్‌లో డజను మంది సీఎం క్యాండిడేట్లు .. ఆ పార్టీకి మళ్లీ 20 సీట్లే : కేసీఆర్
ఇందిరమ్మ రాజ్యంలో లేనోడు మరింత పేదోడిగా మారిపోయారని ఆరోపించారు తెలంగాణ సీఎం కేసీఆర్ . కాంగ్రెస్‌లో డజను మంది సీఎం అభ్యర్ధులున్నారని.. వాళ్లకి మళ్లీ వచ్చేది 20 సీట్లేనంటూ కేసీఆర్ చురకలంటించారు. కాంగ్రెస్ నేతలు రైతుబంధు దుబారా అని ఆరోపిస్తున్నారని.. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారని మండిపడ్డారు.
ఇందిరమ్మ రాజ్యంలో లేనోడు మరింత పేదోడిగా మారిపోయారని ఆరోపించారు తెలంగాణ సీఎం కేసీఆర్ . అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం వైరాలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ.. వైరా ప్రాజెక్ట్ కింద నీళ్లు పారితే గతంలో పన్నులు వసూలు చేశారని కేసీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పన్నులు రద్దు చేశామని.. 7,410 ఎకరాలను 3,650 కుటుంబాలకు పంపిణీ చేశామని సీఎం గుర్తుచేశారు. పోడు భూములతో పాటు రైతుబంధు అమలు చేస్తున్నామని.. 3,659 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని కేసీఆర్ తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇంటింటికి మంచినీరు అందిస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ హయాంలో పట్టణాలు, గ్రామాల పరిస్ధితి ఎలా వుండేదో ప్రతి ఒక్కరికీ తెలుసునని కేసీఆర్ చురకలంటించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలా వుంది, బీఆర్ఎస్ వచ్చాక ఈ పదేళ్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో ఆలోచించాలని సీఎం పిలుపునిచ్చారు. తలసారి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా వుందన్నారు. కాంగ్రెస్‌లో డజను మంది సీఎం అభ్యర్ధులున్నారని.. వాళ్లకి మళ్లీ వచ్చేది 20 సీట్లేనంటూ కేసీఆర్ చురకలంటించారు.
అనంతరం డోర్నకల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నీటి పన్నులు వున్నాయన్నారు. తెలంగాణలో మాత్రం నీటి పన్నులు లేవని.. రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని కేసీఆర్ చెప్పారు. 7,500 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని.. 50 ఏళ్ల కాంగ్రెస్ రాజ్యంలో ప్రజలను పట్టించుకోలేదని సీఎం ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశామని.. 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని కేసీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలు రైతుబంధు దుబారా అని ఆరోపిస్తున్నారని.. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామంటున్నారని మండిపడ్డారు.
తర్వాత సూర్యాపేటలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పుట్టిందని చెప్పారు. పెన్ పహాడ్ కాలువలో ఏడాదంతా నీళ్లు వస్తున్నాయని.. ఎన్నికల సమయంలో ఆలోచించి ఓటు వేయాలని సీఎం సూచించారు. కాంగ్రెస్ పాలనలో మూసీ ప్రాజెక్ట్ నాశనమైందని.. 7,500 కేంద్రాల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం 30 లక్షల పంపు సెట్లు వున్నాయని.. రైతులు 10 హెచ్‌పీ మోటార్లు పెట్టుకోవాలని కొందరు చెబుతున్నారని సీఎం చురకరలంటించారు. 3 గంటల విద్యుత్ ఇస్తే పొలానికి సరిపడా నీళ్లు పారుతాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. 3 గంటల విద్యుత్ సరిపోతుందా అని సీఎం నిలదీశారు.