అధికారమిస్తే గొడ్డలితో వేటు :సత్తుపల్లిలో కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్
తెలంగాణ ఏర్పాటైతే కటిక చీకట్లో కూరుకుపోతుందని విమర్శలు చేసిన వారే చీకట్లో కూరుకుపోయారని కేసీఆర్ చెప్పారు.
సత్తుపల్లి:కాంగ్రెస్ భుజం మీద గొడ్డలి ఉంది.. అధికారం ఇస్తే వేటు వేస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను హెచ్చరించారు.బుధవారంనాడు సత్తుపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ దళారుల రాజ్యం వస్తుందన్నారు.రైతు బంధు దుబారా అని కొందరు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారన్నారు. రైతు బంధు ఉండాలా వద్దో చెప్పాలని ఆయన కోరారు. ధరణి వచ్చాక గ్రామాలు చల్లగా ఉంటున్నాయన్నారు. ధరణిని తొలగిస్తామని రాహుల్ గాంధీ కూడ చెబుతున్నారన్నారు. ధరణి గురించి రాహుల్ గాంధీకి ఏం తెలుసునని ఆయన ప్రశ్నించారు. రైతుల కష్టాల గురించి రాహుల్ గాంధీకి ఏం తెలుసునని ఆయన అడిగారు.
ఎన్నికల్లో వ్యక్తులు , కార్యదక్షతను చూడాలన్నారు. ఎన్నికలు రావడం సహజమేనన్నారు.ఓటు వేసే సమయంలో ఆలోచించాలని ఆయన ప్రజలను కోరారు. పోటీలో ఉన్న అభ్యర్ధి ఎవరు, అతని పార్టీ చరిత్ర ఎమిటో తెలుసుకోవాలన్నారు. ఏ పార్టీ ప్రజలకు ఏం చేసిందో చూడాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆయుధం ఓటేనన్నారు. స్వంత నిర్ణయంతో ఓటేసినప్పుడే ప్రజాస్వామ్యం గెలుస్తుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
సత్తుపల్లి చాలా చైతన్యవంతమైన ప్రాంతంగా కేసీఆర్ గుర్తు చేశారు.సత్తుపల్లి సభకు వచ్చిన జనాన్ని చూస్తే బీఆర్ఎస్ అభ్యర్ధి సండ్ర వెంకట వీరయ్య 70 నుండి 80 వేల మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఉందన్నారు.
తరతరాలుగా దళితులు వివక్షకు గురయ్యారన్నారు. దళిత జాతిని ఓటు బ్యాంకుగానే అన్ని పార్టీలు ఉపయోగించుకున్నాయని కేసీఆర్ విమర్శించారు.75 ఏళ్లు గడిచినా దళితుల పరిస్థితుల్లో మార్పు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల శ్రేయస్సు గురించి ఎవరూ ఆలోచించలేదన్నారు.
దళితబంధు అనే పదం పుట్టించిందే కేసీఆర్ అని చెప్పారు. కేసీఆర్ కంటే ముందు ఎవరైనా దళితబంధు గురించి ఆలోచించారా అని ఆయన ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేసే వాళ్లమే అయితే మొదటి టర్మ్ లోనే దళిత బంధు పెట్టేవాళ్లమని కేసీఆర్ చెప్పారు. కరోనా, నోట్ల రద్దు లేకుంటే దళితబంధును ఎప్పుడో అమలు చేసేవాళ్లమని కేసీఆర్ ప్రకటించారు.
ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ ఎస్ సీలపై నిత్యం దాడులు జరుగుతున్నాయని కేసీఆర్ చెప్పారు.ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన పథకాల కంటే 10 రెట్లు పథకాలు అమలు చేశామని కేసీఆర్ చెప్పారు.ఎన్నికల కోసం మిషన్ భగీరథ పెట్టామా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో ఆరు నూరైనా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.
బీఆర్ఎస్ నుండి పోటీ చేసే అభ్యర్థులను అసెంబ్లీలో అడుగు పెట్టనీయమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ప్రస్తావించారు. నాలుగు పైసలు ఉన్నంత మాత్రానా ఇంత అహంకారమా అని ఆయన ప్రశ్నించారు.గడియారాలు,పైసలు పంచడం రాజకీయమా అని ఆయన అడిగారు.రూ. 70 గడియారం కావాలా.. ఆత్మగౌరవం కావాలా తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
పక్క రాష్ట్రంలో రోడ్లు, మన రాష్ట్రంలో రోడ్లకు తేడా చూడాలన్నారు. తెలంగాణ ఏర్పడితే చీకటి అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ చీకటి అవుతుందన్న వారే చీకట్లోకి వెళ్లారని ఆయన ఎద్దేవా చేశారు. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ, సింగిల్ రోడ్డు వస్తే ఆంధ్రప్రదేశ్ అని ఆయన ఎద్దేవా చేశారు.సరిహద్దులోని ఏపీ ప్రజలు తెలంగాణకు వచ్చి వరి ధాన్యం అమ్ముకుంటున్నారని కేసీఆర్ చెప్పారు. ఇవాళ తెలంగాణలో విద్యుత్ వెలుగు జిలుగులున్నాయన్నారు.
మోడీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుందన్నారు.అనేక ప్రభుత్వ సంస్థలను మోడీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసిందని కేసీఆర్ విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఆదేశిస్తే తాము పట్టించుకోలేదన్నారు. రూ. 25 వేల కోట్ల నష్టమైనా భరిస్తాం.. కానీ మీటర్లు పెట్టబోమన్నారు. ధరణి వచ్చిన తర్వాత రైతాంగం నిశ్చింతంగా ఉందని కేసీఆర్ చెప్పారు.