స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసి ప్రసంగంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. మన సంక్షేమ పథకాలను కేంద్రం ఉచితాలని అంటోందని... మోడీ 8 ఏళ్ల పాలనలో చేసిందేంటీ అని సీఎం ప్రశ్నించారు
ప్రధాని నరేంద్ర మోడీని (narendra modi) టార్గెట్ చేసుకుని మరోసారి విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr). మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్, వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ (trs) పార్టీ కార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ... తాను ఉద్యమం చేస్తున్న సమయంలో రంగారెడ్డి జిల్లాలో వున్న కొందరు సీమాంధ్ర తొత్తులు తెలంగాణ వస్తే ఈ ప్రాంతంలో భూముల ధరలు పడిపోతాయని ప్రచారం చేశారని మండిపడ్డారు. తెలంగాణలోనే భూముల ధరలు ఎక్కువగా వున్నది రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనేనని కేసీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు కర్ణాటక, ఏపీలకి మించి భూముల ధరలు తెలంగాణలో పెరిగాయని సీఎం గుర్తుచేశారు. వికారాబాద్ జిల్లాకు మెడికల్, డిగ్రీ కాలేజీలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్.
తమను తెలంగాణలో కలపాలని కర్ణాటక ప్రజలు అక్కడి ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తున్నారని కేసీఆర్ తెలిపారు. లేదంటే తెలంగాణ లాంటి పథకాలను కర్ణాటకలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. రాష్ట్రం బాగుంటే సరిపోదని.. ఇప్పుడు దేశంలో ఏం జరుగుతోందని సీఎం ప్రశ్నించారు. కేంద్రం ఉచితాలు వద్దంటోందని... సెంటర్‌లో అధికారంలో వున్న బీజేపీ ఒక్క మంచిపనైనా చేసిందా అని కేసీఆర్ నిలదీశారు. మన సంక్షేమ పథకాలను కేంద్రం ఉచితాలని అంటోందని... మోడీ 8 ఏళ్ల పాలనలో చేసిందేంటీ అని సీఎం ప్రశ్నించారు.
ALso REad:అరగంట ఎదురుచూశాం.. ఎట్‌హోమ్‌కు కేసీఆర్ రాకపోవడంపై తమిళిసై ఎమన్నారంటే..
వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టమంటున్నారని... సంస్కరణల పేరుతో మనకు శఠగోపం పెట్టి షావుకార్లకు నింపుతున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. ఉచిత కరెంట్ వద్దంటున్న కేంద్రం పెద్ద వ్యాపారులకు లక్షల కోట్లు మాఫీ చేసిందని ఆయన ఫైరయ్యారు. కేంద్రం వల్లే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ఆలస్యమైందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జెండా పట్టుకుని నా బస్‌కు అడ్డం వస్తారా అని ఆయన దుయ్యబట్టారు. ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యాడని... నిన్న మోడీ స్పీచ్‌లో ఏం లేదని సెటైర్లు వేశారు. నెత్తికి రుమాల్ కట్టి వేషం తప్ప ఏముందని ప్రధాని మోడీపై విమర్శలు చేశారు.
