హైదరాబాద్: బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలను కించపర్చేలా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లు వెనక్కి తీసుకోవాలని కేసీఆర్  డిమాండ్ చేశారు.

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో  ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ప్రస్తావించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని మోడీ చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా  డార్క్ డే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తప్పుబట్టారు.  తెలంగాణ ప్రజలను కించపర్చేలా  ప్రధాని మోడీ, అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఎవరూ ఇవ్వలేదన్నారు. కోట్లాడి తెచ్చుకొన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని కేసీఆర్ చెప్పారు. ఇక ఎల్లుండే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోందనే హడావుడి చేస్తోందని కేసీఆర్ విమర్శలు చేశారు.

బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు.  గతంలో ఆ పార్టీకి ఈ అసెంబ్లీలో ఐదు ఎమ్మెల్యేలు ఉండేవన్నారు. కానీ, ప్రస్తుత సభలో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో  రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకొన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.మరో రెండు టర్మ్‌లు రాష్ట్రంలో టీఆర్ఎస్ మాత్రమే అధికారంలోకి వస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

ఒకవేళ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆరోగ్య శ్రీ పోయి ఆయుష్మాన్ భవ తీసుకొస్తారన్నారు. రైతు బంధు పథకం  స్థానంలో  కిసాన్ సమ్మాన్ ను తీసుకొస్తారన్నారు. ఈ పథకం కింద ఎకరానికి రూ. 6 వేలు ఇస్తారని చెప్పారు. రైతు బంధు పథకం కావాలా..  కిసాన్ సమ్మాన్ కావాలో రైతులకు తెలుసునన్నారు.

తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టుగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సంక్షేమ పథకాలను  అమలు చేస్తున్నారా అని కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రలోని నాందేడ్  ప్రాంతంలోని ప్రజలు తెలంగాణలో కలపాలని కోరుకొంటున్నారని కేసీఆర్ చెప్పారు.

అంతేకాదు  టీఆర్ఎస్  గుర్తుపై పోటీ చేసేందుకు కూడ నాందేడ్ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు అభిప్రాయంతో ఉన్నారని కేసీఆర్ చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ అంత గొప్పగా పాలన ఉంటే నాందేడ్  ప్రజలు తెలంగాణలో కలపాలని ఎందుకు కోరుకొంటారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ పాలన కంటే వంద రెట్లు పాలన బాగుందని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అసెంబ్లీలో కేసీఆర్, భట్టి మధ్య వాగ్వాదం: కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం ముగిసిన కథ