బంగాళాఖాతంలో కలపండి:జనగామ సభలో కాంగ్రెస్ పై కేసీఆర్ ఫైర్ (వీడియో)
జనగామలో ఇవాళ నిర్వహించిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు.
జనగామ:వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని చెబుతున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలని బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. రైతులకు 24 గంటల విద్యుత్ ను సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలన్నారు.
సోమవారం నాడు జనగామలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అన్న చెప్పాడనో, బావ చెప్పాడనో ఓటు వేయవద్దన్నారు. ఓటు వేసే సమయంలో జాగ్రత్తగా ఆలోచించాలని ఆయన కోరారు. ఒక్కసారి తప్పుగా ఓటు వేస్తే నష్టపోతామన్నారు.జనగామ, భువనగిరిలు గ్రోత్ కారిడార్ లుగా మారాయన్నారు. జనగామ అసెంబ్లీ స్థానం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
పాత వరంగల్ జిల్లాలో అత్యధికంగా వరి పండించే తాలుకా జనగామ అని కేసీఆర్ చెప్పారు.ఎన్నికలు రాగానే నోటికి వచ్చినట్టుగా మాట్లాడి వెళ్లిపోతారన్నారు.ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మెుక్కే వారిని నమ్మొద్దని ఆయన ప్రజలకు సూచించారు. ఎన్నికల సమయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ప్రజలను కోరారు.
జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి దేవాదుల, కాళేశ్వరం నుండి నీళ్లు రానున్నాయన్నారు. ఎక్కడ కరువొచ్చినా జనగామలో మాత్రం కరువు రాదన్నారు. మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ , పారా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.తెలంగాణ ఏర్పాటు కాకముందు కొన్ని జిల్లాలకు వెళ్తే తనకు ఏడుపొచ్చేదన్నారు. జనగామ అసెంబ్లీలోని బచ్చన్నపేటలోని పరిస్థితిని చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బచ్చన్నపేట చెరువులో 365 రోజులు నీళ్లుంటున్నాయని ఆయన తెలిపారు.
also read:బీఆర్ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య: కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్
కొత్త జిల్లాల ఏర్పాటులో ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకున్నామన్నారు. భవిష్యత్తులో జనగామ అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని కేసీఆర్ చెప్పారు.ఐటీ, పారిశ్రామికంగా జనగామ అభివృద్ది చెందే అవకాశాలున్నాయన్నారు.తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆర్ధిక నిపుణులను పిలిపించి రాష్ట్ర అభివృద్దికి ప్రణాళికలు రచించినట్టుగా చెప్పారు.మేథోమథనం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించినట్టుగా కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ నుండి రెండు నెలల పాటు వేలాది లారీల్లో ధాన్యం తరలిస్తున్నామన్నారు. తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే దారినపడ్డారన్నారు.రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు ఉండాలనే ఉద్దేశ్యంతో ధరణిని తెచ్చినట్టుగా కేసీఆర్ చెప్పారు. తాను కూడ రైతునే.. రైతుల బాధలు తనకు తెలుసున్నారు. అందుకే ధరణిని తీసుకు వచ్చినట్టుగా కేసీఆర్ వివరించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళఖాతంలో వేస్తామని చెబుతున్నారన్నారు. తమ భూములపై రైతులు హక్కులు కోల్పోయేలా ధరణిని తొలగిస్తామన్న కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలని కేసీఆర్ ప్రజలను కోరారు.
ధరణిని ఎత్తివేస్తే మళ్లీ అధికారుల పెత్తనం పెరిగే అవకాశం ఉందన్నారుపాస్ బుక్ లో కౌలు రైతుల పేర్లు చేర్చాలని కాంగ్రెస్ కోరుతుందన్నారు. తన ప్రాణం పోయినా కూడ ఆ పని చేయనని కేసీఆర్ తేల్చి చెప్పారు.కర్ణాటకలో ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. విద్యుత్ కోసం రైతులు కర్ణాటకలో ఆందోళనలు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు.
బంగారు కత్తి అని మెడకోసుకుంటామా అని కేసీఆర్ ప్రశ్నించారు. పేద ప్రజల కోసం తమ మేనిఫెస్టోలో అనేక అంశాలు చేర్చినట్టుగా కేసీఆర్ వివరించారు. రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నందునే భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. మత కల్లోహాలు లేకుండా శాంతిభద్రతలు బాగున్నాయని చెప్పారు. కొందరు వచ్చి మతం పేరుతో విబేధాలు సృష్టించాలని కేసీఆర్ పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు.తెలంగాణలో హిందూ ముస్లింల మధ్య సోదరభావం ఉందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురవేయగానే అప్పటి సీఎం చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి మభ్య పెట్టే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయంలో కొంత పనులు జరిగినట్టుగా కేసీఆర్ గుర్తు చేశారు. దళితబంధు పథకం పెట్టాలని ఎవరైనా ఆలోచించారా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఓట్ల కోసం మేం అబద్దాలను మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు.