పోయే కాలం వచ్చింది, అధికారం నెత్తికెక్కి మాటలు: తెలంగాణ అసెంబ్లీలో బీజేపీపై కేసీఆర్ ఫైర్

కేంద్రంలోని బీజేపీకి పోయే కాలం వచ్చిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో ఇవాళ విద్యుత్ సవరణ 2022 బిల్లుపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో బీజేపీపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Telangana CM KCR Serious Comments On BJP In Telangana Assembly

హైదరాబాద్: అధికారం నెత్తికెక్కి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. ముస్సోలిని, హిట్లర్, నెపోలియన్ లాంటి వాళ్లనే  ఎవరూ కాపాడలేదని కేసీఆర్ గుర్తు చేశారు. బీజేపీని కూడా ఎవరూ కాపాడలేరని కేసీఆర్ చెప్పారు.

సోమవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర విద్యుత్ సంస్కరణ బిల్లుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. వేరే పార్టీలను ఉంచబోమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్ర హోం మంత్రి ఇంత అప్రజాస్వామికంగా మాట్లాడొచ్చా అని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతల మాటలతో భరతమాత గుండెకు గాయమౌతుందన్నారు.. గాంధీ, బుద్దుడు పుట్టిన దేశంలో ఏం జరుగుతుందో ఆలోచించాల్సిన అవసరం నెలకొందన్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నారని బీజేపీ పై కేసీఆర్ మండిపడ్డారు.

తమిళనాడులో ఏక్ నాథ్ షిండేలు వస్తారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీకి ముగ్గురే ఎమ్మెల్యేలున్నారన్నారు. తెలంగాణలో కూడా ప్రభుత్వాన్ని కూలదోస్తామని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.  పోయే కాలం వచ్చింది కాబట్టే బీజేపీ నేతలు అలా మాట్లాడుతున్నారని కేసీఆర్ చెప్పారు. బీజేపీకి ఇంకా 20 నెలల సమయం మాత్రమే అధికారంలో ఉండడానికి సమయం ఉందన్నారు. 11 రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చేశారని బీజేపీపై కేసీఆర్ విమర్శలు చేశారు. 

అగ్నిపథ్ పేరుతో ఆర్మీలో రిక్రూట్ మెంట్ విధానంలో మార్పులు తీసుకు వస్తే దేశం రగలిపోయిందని కేసీఆర్ చెప్పారు. అప్పటికప్పుడు పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయవచ్చు,  కానీ యువకుల గుండెల్లో రగిలే మంటలను ఎలా ఆర్పుతారని కేసీఆర్ ప్రశ్నించారు.

 8 ఏళ్లలో తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ 979 నుండి 2126 మెగావాట్లకు చేరుకుందన్నారు. దేశంలో తలసరి విద్యుత్ వినయోగం 950 నుండి 1250 యూనిట్లకు మాత్రమే పెరిగిందన్నారు.తెలంగాణలో  విద్యుత్ వినియోగం 1156 యూనిట్లకు పెరిగితే దేశంలో 521 యూనిట్లు మాత్రమే పెరిగిందన్నారు.కేంద్రంలో మోడీ సర్కార్, తెలంగాణలో టీఆర్ఎస్ ఒకే సమయంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.  విద్యుత్ తలసరి వినియోగంలో ప్రపంచంలో తెలంగాణ 104 స్థానంలో ఉన్నామని కేసీఆర్ తెలిపారు. 

also read:విభజన చట్టంలోని అనేక అంశాల్లో తెలంగాణకు అన్యాయం: అసెంబ్లీలో కేసీఆర్

ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రైవేటీకరిస్తుందని తెలంగాణ సీఎం  కేసీఆర్ చెప్పారు.  ఇప్పటికే  రైల్వే, విమానాలు,పోర్టుల వంటి వాటిని కేంద్రం ప్రైవేటీకరించిందని ఆయన ఆరోపించారు. వ్యవసాయం, విద్యుత్ మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన చెప్పారు. వీటిని కూడా సంస్కరణల పేరుతో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.దుబ్బాకలో పండిన ధాన్యాన్ని సిద్దిపేటలోనే అమ్మే పరిస్తితి లేదన్నారు. అలాంటిది తెలంగాణలో పండిన ధాన్యాన్ని ఎక్కడైనా  ఎలా విక్రయించుకొంటామని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఢిల్లీలో ధర్నాలు చేసిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.ఈ విషయమై  కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తే తెలంగాణ ను అవహేళన చేస్తూ గోయల్ వ్యాఖ్యలు చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. అవగాహన లోపంతోనే ఆహర రంగాన్ని కేంద్రం సంక్షొభంలోకి నెట్టిందని కేసీఆర్ విమర్శించారు. 20 శాతం సుంకం పెంచి నూకలపై కేంద్రం బ్యాన్  విధించిందన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios