బీఆర్ఎస్‌లో చేరతానని.. మాట తప్పారు , సీఎం అవుతానని కలలు : జానారెడ్డిపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
24 గంటల కరెంట్ ఇస్తే బీఆర్ఎస్‌లో చేరతానని జానారెడ్డి గతంలో అన్నారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 24 గంటల కరెంట్ ఇచ్చినా జానారెడ్డి మాత్రం మాటల నిలబెట్టుకోలేదని సీఎం చురకలంటించారు.
ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ.. 24 గంటల కరెంట్ వద్దని, 3 గంటలు చాలని, పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నారంటూ చురకలంటించారు. నాయకుల మాటలు విని గోల్‌మాల్ కావొద్దన్నారు. 50 ఏళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలన చేసిందని.. మన బతుకులు మారాయా అని కేసీఆర్ ప్రశ్నించారు. గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుకున్నామని, అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన బంధు ఇస్తామని సీఎం తెలిపారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా దళితులను ఆదుకుందా అని కేసీఆర్ ప్రశ్నించారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా రావాల్సినంత పరిణతి రాలేదన్నారు. ఎన్నికలు అనగానే ఎందరో వస్తున్నారు, ఏవేవో మాట్లాడుతున్నారని సీఎం ఫైర్ అయ్యారు. నియోజకవర్గం బాగుపడాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మంది మాటలు విని ఆగమైతే ఐదేళ్ల పాటు కష్టాల పాలవుతామని సీఎం పేర్కొన్నారు. ఓటు వేసే ముందు అన్నీ ఆలోచించి వేయాలని కేసీఆర్ సూచించారు. నిజానిజాలు గమనించి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నానని సీఎం అన్నారు. పార్టీల చరిత్ర , నడవడిక ఎలాంటిదో చూడాలని.. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల బాగు కోసం కేసీఆర్ పేర్కొన్నారు.
రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని .. ఏం చేద్దామని సీఎం ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే ధరణి పోర్టల్ తీసేస్తామని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెబుతున్నారని కేసీఆర్ చురకలంటించారు. కాంగ్రెస్ పాలనలో తాగు, సాగునీరు, కరెంట్ సంగతి మీకు తెలుసునని సీఎం గుర్తుచేశారు. అభివృద్ధిలో ముందుకే వెళ్లాలని.. వెనక్కి పోవద్దని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం మరోసారి నిలబెట్టాలని ఆయన కోరారు.
24 గంటల కరెంట్ ఇస్తే బీఆర్ఎస్‌లో చేరతానని జానారెడ్డి గతంలో అన్నారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 24 గంటల కరెంట్ ఇచ్చినా జానారెడ్డి మాత్రం మాటల నిలబెట్టుకోలేదని సీఎం చురకలంటించారు. జానారెడ్డి సీఎం అవుతానని కలలు కంటున్నారని.. ఆయనకు మీరు ఓటుతోనే బుద్ధి చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు. నాగార్జున సాగర్‌లో భగత్ 70 వేల మెజారిటీతో గెలుస్తారని సీఎం ధీమా వ్యక్తం చేశారు. కంటి వెలుగు వంటి పథకాన్ని దేశంలో ఎవరైనా తెచ్చారా అని కేసీఆర్ ప్రశ్నించారు.