హైదరాబాద్: లక్షలాది మంది రైతులతో కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు నిరంతర పరిశ్రమతో పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యవసాయశాఖాధికారులను కోరారు. 

సంప్రదాయక వ్యవసాయ పద్ధతుల స్థానంలో గొప్ప పరివర్తన రావాలన్నారు. మేలైన సాగు విధానాలు, లాభదాయక పద్ధతులు చెప్పేందుకు వ్యవసాయ శాఖ మార్గదర్శనం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నందున దానికి తగ్గట్టు వ్యవసాయ శాఖ కూడా సంస్థాగతంగా బలోపేతం కావాలని సిఎం ఆకాంక్షించారు. 

అవసరమైతే వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రైతులు వేసిన పంటల వివరాలను  తీసుకోవాలని సిఎం ఆదేశించారు.

వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎస్ సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. 

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పరచడానికి స్వతంత్ర్య భారతదేశంలో గతంలో ఎన్నడూ, ఎక్కడా జరగనంత ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టుల నిర్మాణం జరిపి, రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా భూమి శిస్తు తీసుకోవద్దనే లక్ష్యంతో నీటి తీరువా విధానాన్నే రద్దు చేయడంతో పాటు పాత బకాయిలను ప్రభుత్వం మాఫీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల కరెంటును ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నది. వ్యవసాయానికి కావాల్సిన పెట్టుబడిని రైతుబంధు పథకం కింద ప్రతీ పంటకు తమ ఖాతాల్లోనే జమ చేస్తుందన్నారు.  రైతులను సంఘటిత పరిచేందుకు ప్రభుత్వమే పూనుకుని రైతుబంధు సమితులు ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. 

క్లస్టర్ల వారీగా  రైతు వేదికల నిర్మాణం కూడా మూడు నెలల్లో పూర్తి అవుతుంది. రైతు వేదికలు రైతుల చైతన్యానికి వేదికలుగా మారుతాయి. ముఖ్యమంత్రితో పాటు ఎవరైనా సరే నేరుగా రైతులతో మాట్లాడే వెసులుబాటు కలుగుతుందని కేసీఆర్ వివరించారు. 

తెలంగాణలో వ్యవసాయం లాభసాటిగా మారాలి. అంతిమంగా రైతులు ధనిక రైతులుగా మారాలి. అందుకోసమే ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను అధ్యయనం చేసి, వాటిని తెలంగాణలో అమలు చేయాలని ఆయన సూచించారు. వ్యవసాయ రంగంలో గొప్ప పరివర్తన రావాలి.  ఆధునిక సాగు పద్ధతులు రావాలి. యాంత్రీకరణ పెరగాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.

 తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా ఏ పంటలు పండుతాయో తెలుసుకోవాలి. వాటి సాగు పద్దతులు తెలుసుకోవాలి. అధికారులు, రైతులు తరచూ విజ్ఞాన యాత్రలు చేయాలి. రాష్ట్రంలో, దేశంలో, ఇతర దేశాల్లో మెరుగైన సాగు పద్ధతులను అధ్యయనం చేసి రావాలని ఆయన సూచించారు

ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. మార్కెట్ ను అధ్యయనం చేయాలి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా నాణ్యమైన, మేలు రకమైన కూరగాయలు, ఆహార పదార్థాలు వారికి అందించేలా పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.

 ఈ పనుల కోసం వ్యవసాయ శాఖ ప్రత్యేక విభాగాలను పెట్టి ఒక్కో విభాగానికి ఒక్కో అడిషనల్ డైరెక్టర్ ను నియమించాలి. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒకరు చొప్పున వ్యవసాయ విస్తరణాధికారులను నియమించామన్నారు.

 పెరిగిన విస్తీర్ణం, అవసరాల మేరకు అవసరమనుకుంటే అదనంగా ఎఇవోలను నియమించుకోవాలి. వ్యవసాయ శాఖను మారిన పరిస్థితులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలి. ఉద్యానవన శాఖను కూడా ప్రక్షాళన చేయాలని ఆయన అధికారులకు సూచించారు. 

రైతులకు సరైన మార్గదర్శనం చేస్తే వ్యవసాయాన్ని తప్పక లాభదాయకంగా మార్చవచ్చు. ఏ గుంటలో ఏ రైతు ఏ పంట వేశాడనే లెక్కలు తీయాలి. అది చాలా ముఖ్యమని సీఎం అభిప్రాయపడ్డారు.

మన  దేశ ప్రజలకు మనమే తిండి పెట్టే విధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలి. దేశం స్వయం పోషకం కావాలి. కేవలం ఆహారమే కాకుండా ప్రజలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రయత్నం చేయాలని కేసీఆర్ కోరారు.