తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమయ్యారు. వర్షాలు, వరదల పరిస్థితిపై శనివారం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, మంత్రులతో మాట్లాడారు .

భారీ వర్షాల కారణంగా కాల్వలు పొంగిపొర్లుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో రెండు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని.. మంత్రులు జిల్లాల్లో ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు.

Also Read:వాగులో చిక్కుకున్న 12 మంది రైతులు: హెలికాప్టర్ పంపిన కేటీఆర్, కేసీఆర్ ఆరా

లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం కురుస్తున్నందున ఆ రెండు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు.

సహాయక చర్యల కోసం రెండు హెలికాఫ్టర్లను సిద్ధంగా ఉంచామని.. వీటిని వరదల్లో చిక్కుకున్న వారి కోసం ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చాలా చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని ఫలితంగా కొన్ని చెరువులకు గండ్లు పడే అవకాశం వుందన్నారు.

వరదల కారణంగా రోడ్లు తెగిపోయే ప్రమాదం వుందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్ధితి వుందని కేసీఆర్ అన్నారు.