వరద బీభత్సంతో వణికిపోయిన హైదరాబాద్‌లో పునరావాస కార్యకలాపాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్. నగరంలో జరుగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

ప్రతి బాధిత కుటుంబానికి పది వేల రూపాయల తక్షణ సాయం అందజేత ముమ్మరంగా సాగాలన్నారు. పండుగకు ముందే డబ్బు అందితే పేదలకు ఉపయోగకరంగా ఉంటుందని సీఎం ఆకాంక్షించారు.

రోజుకు కనీసం లక్ష మందికి ఆర్ధిక సాయం అందించేలా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అటు నీళ్లు నిలిచివున్న ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ప్రమాదకరంగా ఉన్నందున నీరు తొలగించిన ప్రాంతాలు, అపార్ట్‌మెంట్‌లకే కరెంట్ పునరుద్దరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Also Read:26న దసరా సెలవు: ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

మరోవైపు ప్రతి 6 నెలలకు రాష్ట్రంలో చెల్లించాల్సిన డీఏ నిర్ణయించాలని, కేంద్రం అంచనాలు అందిన తర్వాత అవసరమైతే సవరించాలని అధికారులకు సూచించారు. కేబినెట్‌లో చర్చించి డీఏపై విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు.

2019 జులై 1 నుంచి రావాల్సిన ఒక డీఏను వెంటనే ఉద్యోగులకు చెల్లించాలి.. డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. 2020-21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గిందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడిందని అన్నారు. కేంద్ర జీడీపీ కూడా మైనస్ 24 శాతానికి పడిపోయిన నేపథ్యంలో బడ్జెట్‌పై సమీక్ష నిర్వహించి నివేదిక ఇవ్వాలని కోరారు.