నా దమ్మేందో దేశం చూసింది: కొడంగల్ లో పోటీ చేయాలన్న రేవంత్ సవాల్ పై కేసీఆర్ కౌంటర్
అచ్చంపేట సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన సవాల్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు.
అచ్చంపేట:తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన సమయంలో కన్పించని వారంతా ఇవాళ దమ్ముందా రా అంటూ సవాళ్లు చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన సవాల్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు.
కొడంగల్ లో పోటీ చేయాలని కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ తన సవాల్ కు స్పందించకపోతే గజ్వేల్ లో పోటీ చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశిస్తే పోటీ చేస్తానని రేవంత్ రెడ్డి ఇవాళ ప్రకటించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి సవాల్ పై కేసీఆర్ సెటైరికల్ గా స్పందించారు.
తెలంగాణ కోసం తాను బయలుదేరి 24 ఏళ్లు అయిందన్నారు.తాను తెలంగాణ కోసం బయలుదేరిన సమయంలో ఎవరూ లేరన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన నాడు లేని వారంతా ఇవాళ తనకు సవాళ్లు విసురుతున్నారన్నారు.కొంతమంది ఇప్పుడొచ్చి కేసీఆర్ కు దమ్ముందా అని అంటున్నారని చెప్పారు. కొడంగల్ కు రా, గాంధీ బొమ్మ దగ్గరకు రా అని సవాళ్లు చేస్తున్నారని కేసీఆర్ విమర్శలు చేశారు.
కొడంగల్ కు కొడవలి పట్టుకు వస్తావా అని తనను సవాల్ చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పరోక్షంగా విమర్శలు చేశారు. కేసీఆర్ దమ్ము దేశమంతా చూసిందన్నారు. నవంబర్ 30 మీరంతా దుమ్ము లేపాలని ఆయన ప్రజలను కోరారు.
రాజకీయమంటే ఇలాంటి సవాళ్లా అని ఆయన ప్రశ్నించారు.తెలంగాణ సాధన కోసం తాను ఒక్కడినే పక్షిలా తిరిగినట్టుగా కేసీఆర్ గుర్తు చేశారు. కొడంగల్ కు, గాంధీ బొమ్మకు రావాలని సవాల్ చేస్తున్న సిపాయిలంతా ఆనాడు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటిదాకా తాను పోరాటం చేసినట్టుగా కేసీఆర్ చెప్పారు.ఇకపై పోరాటం చేయాల్సింది మీరేనని ఆయన ప్రజలను కోరారు.
24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన గుర్తు చేశారు. ప్రధాని మోడీ గుజరాత్ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ లేదన్నారు. కర్ణాటకలో కరెంట్ ఇచ్చే దిక్కే లేదని కేసీఆర్ విమర్శించారు. కర్ణాటక రైతులు కొడంగల్ ,గద్వాలకు వచ్చి ధర్నాలు చేస్తున్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.
. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. రైతు బంధు అనే పథకాన్ని సృష్టించింది తానేనన్నారు.దశలవారీగా పెన్షన్ ను రూ. 5 వేలకు పెంచుకుంటూ పోతామని కేసీఆర్ ప్రకటించారు.
మనకు కులం, మతం లేదు... ఉన్నది తెలంగాణ ఒక్కటేనని కేసీఆర్ చెప్పారు.ఎన్నికల సమయంలో ఆగం కావద్దని కేసీఆర్ ప్రజలను కోరారు. ఎవరో చెప్పారని ఓటు వేయవద్దని ఆయన సూచించారు.ఎవరి కారణంగా తెలంగాణ బాగుపడిందో చూసి ఓటేయాలని కేసీఆర్ కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ కుక్కలు చింపిన విస్తరిగా మారుతుందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంది కాంగ్రెస్ నేతలేనని కేసీఆర్ విమర్శించారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ కాదా అని ఆయన ప్రశ్నించారు. ధరణి వల్లే రైతు బంధు నిధులు సకాలంలో రైతులకు అందుతున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని ఎత్తివేస్తామని చెబుతున్నారన్నారు.ధరణి ఎత్తివేస్తే రైతులకు నష్టమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు ఉండదని కేసీఆర్ చెప్పారు.దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మార్చుకుందన్నారు.
బీఆర్ఎస్ ఓడిపోతే నష్టం లేదన్నారు. తాను రెస్ట్ తీసుకుంటానని చెప్పారు. కానీ ప్రజలకే నష్టమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. స్థిరంగా ఆలోచించి ఓటేయాలని ఆయన ప్రజలను కోరారు.