Asianet News TeluguAsianet News Telugu

మాకు తిక్కరేగితే దుమ్ము రేగాలి: కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనపై విపక్షాలపై కేసీఆర్ ఫైర్

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్ధి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు.  చేతకాని దద్దమ్మలే ఇలాంటి దాడులకు  పాల్పడుతారన్నారు. 

Telangana CM KCR Responds Kotha Prabhakar Reddy Attack lns
Author
First Published Oct 30, 2023, 4:29 PM IST

బాన్సువాడ:తమకు తిక్క రేగితే  రాష్ట్రంలో దుమ్ము రేగాలని  కేసీఆర్   విపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు.  బాన్సువాడలో జరిగిన  బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో  తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు.  దుబ్బాక  బీఆర్ఎస్ అభ్యర్ధి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి గురించి  కేసీఆర్  స్పందించారు.  ప్రభాకర్ రెడ్డి మీద జరిగిన దాడిని తనపై దాడిగా కేసీఆర్ పేర్కొన్నారు.  ఇలాంటి దాడులను అందరూ ఖండించాలని ఆయన  కోరారు. 

చేతకాని దద్దమ్మ ప్రతిపక్ష పార్టీలు హింసకు పాల్పడుతున్నాయని కేసీఆర్ ఆరోపించారు. తాను జుక్కల్ లో ఉన్న సమయంలోనే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన  గురించి తనకు  సమాచారం వచ్చిందన్నారు.  కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం లేదని  మంత్రి హరీష్ రావు చెప్పారన్నారు. ఎన్నికల సభలు  చూసుకొని కోరడంతో తాను బాన్సువాడకు వచ్చినట్టుగా కేసీఆర్ వివరించారు.

మాకు కూడ దమ్ముంది.. తాము దాడులు చేస్తే ఎవరూ మిగలరని కేసీఆర్  హెచ్చరించారు.కత్తులతో పొడవాలంటే మాకు కత్తులు దొరకవా అని ఆయన ప్రశ్నించారు. మా సహనాన్ని పరీక్షిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
 ప్రజలు ఇచ్చిన  పదవులతో  సేవ చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రజలకు సాగు, తాగు నీటిని అందించడంతో పాటు  సంక్షేమ పథకాల విషయంలో తాము ఆలోచిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు  ఎన్నో ఎన్నికలు జరిగాయన్నారు. కానీ ఏనాడూ కూడ ఇలాంటి ఘటనలు జరగలేదని  కేసీఆర్ చెప్పారు. ఎవరి ఎజెండా వారు చెప్పుకోవాలి... ఎవరి ఎజెండా నచ్చితే  ప్రజలు వారిని ఎన్నుకుంటారని కేసీఆర్ చెప్పారు.ప్రజలు గెలిపిస్తే  సేవ చేయాలని ఆయన కోరారు. 

also read:యశోదకు కొత్త ప్రభాకర్ రెడ్డి: మూడు ఇంచుల గాయం, హరీష్ రావు పరామర్శ

గన్ మెన్ అప్రమత్తంగా ఉన్నందునే  కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రాణాపాయం తప్పిందన్నారు.  ప్రభాకర్ రెడ్డి గన్ మెన్ కు కూడ గాయమైందని ఆయన  చెప్పారు.  బాగా పనిచేసే నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని  కేసీఆర్  ఆరోపించారు.హింసా రాజకీయాలను  ప్రజలంతా ఖండించాలని కేసీఆర్  కోరారు.ఎన్నికలు ఎదుర్కొనే దమ్ము లేని వారే కత్తులతో దాడికి దిగుతున్నారని కేసీఆర్ విమర్శించారు.ఇవాళ దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న  కొత్త ప్రభాకర్ రెడ్డిపై  రాజు అనే వ్యక్తి దాడికి దిగాడు.

ఈ దాడిలో ప్రభాకర్ రెడ్డికి గాయాలయ్యాయి. కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు దాడికి పాల్పడే సమయంలో  ఆయన గన్ మెన్ అడ్డుపడ్డాడు. ఈ క్రమంలో గన్ మెన్ చేతికి కూడ గాయమైంది. రాజును బీఆర్ఎస్ కార్యకర్తలు  చితకబాదారు. రాజును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  మరో వైపు ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే రాజు అని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios