జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. దేశాన్ని తనవైపుకు తిప్పుకునేందుకు గాను కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
కేంద్రం ప్రవేశ పెట్టిన విద్యుత్ సంస్కరణలను (electricity reforms) తొలి నుంచి వ్యతిరేకిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) పోరాటానికి సిద్ధమయ్యారు. విద్యుత్ సంస్కరణలను నిరసిస్తూ దేశవ్యాప్త ఉద్యమానికి ఆయన తెరదీసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో విద్యుత్ రంగ నిపుణులు, కార్మికులతో ఆయన సమావేశం కానున్నట్లుగా సమాచారం. జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన కేసీఆర్.. ఎన్డీయేతర పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న హేమంత్ సోరేన్ తో సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, మహరాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీ కూడా కేసీఆర్ కు ఫోన్ చేశారు. హైద్రాబాద్ కు వచ్చిన సమయంలో కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తదితరులు కేసీఆర్ తో భేటీ అయ్యారు.
కాగా.. కొద్దిరోజుల క్రితం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మోడీ (narendra modi) చెప్పేది ఒకటి, చేసేది ఒకటన్నారు. మోడీ అబద్ధాలు ఎక్కువగా చెబుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మోడీ వల్ల దేశం ఎంత నాశనమవుతుందో వివరిస్తూ ఎంతోమంది పుస్తకాలు రాస్తున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. విద్యుత్ సంస్కరణలపైనా అబద్ధాలే చెబుతున్నారని సీఎం ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాల్సిందేనని ముసాయిదా బిల్లులో ప్రస్తావించారని కేసీఆర్ దుయ్యబట్టారు.
మోడీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించారని... పార్లమెంట్‌లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఏపీలో ఇప్పటికే కొన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారని.. మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం ఎఫ్ఆర్‌బీఎం అదనంగా ఇస్తామంటున్నారని కేసీఆర్ తెలిపారు. మీటర్లు పెట్టమనకుండానే జగన్‌మోహన్ రెడ్డి (ys jagan) పెట్టారా అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలు చేయట్లేదని వచ్చే డబ్బులు కూడా ఆపేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి ఇవేమీ తెలియదని.. రాష్ట్రానికి 25 వేల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా, తాను మీటర్లు పెట్టలేదని సీఎం వెల్లడించారు.
మిషన్ భగీరథ ప్రారంభ సభలోనూ మోడీ అబద్ధాలే చెప్పారంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణకు యూనిట్ రూ.1.10కే ఇస్తున్నట్లు మోడీ చెప్పారని.. నా పక్కనే నిలబడి మోడీ అబద్ధం చెబుతున్నా మర్యాద కోసం తాను మాట్లాడలేకపోయానని కేసీఆర్ గుర్తుచేశారు. అసలు ఎప్పుడైనా తెలంగాణకు యూనిట్ రూ.1.10కే విద్యుత్ ఇచ్చారా అని మోడీ సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. 40 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తయినా కరెంట్ ఉత్పత్తి చేయనివ్వడం లేదని.. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విద్యుత్ విధానం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని కేసీఆర్ ఆరోపించారు.
మాకు అర్ధమయ్యే మీ రంగు బయటపెట్టామని, 40 కోట్లమంది దళితులకు 12 వేల కోట్లు కేటాయించింది నిజం కాదా అని సీఎం ప్రశ్నించారు. అన్నీ అమ్మేస్తున్నారని.. ఇప్పుడు విద్యుత్ అమ్మడానికి సిద్ధమయ్యారని కేసీఆర్ ఆరోపించారు. డిస్కమ్‌లను ప్రైవేట్‌పరం చేయాలనుకోవడం చాలా దారుణమన్నారు. విద్యుత్ ప్రైవేట్‌పరమైతే ఇబ్బడిముబ్బడిగా ఛార్జీలు పెరిగి జనం చస్తారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
