విశాఖపట్నంలో  గ్యాస్ లీక్ ఘటనలో పది మంది మరణించిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం దురదృష్టకరమని.. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు సీఎం అన్నారు.

Also Read:వైజాగ్ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన: పదికి పెరిగిన మృతుల సంఖ్య

అంతకుముందు తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ఈ ఘటనపై ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తూ.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అందరూ తొందరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు కేటీఆర్. అలాగే మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు..

మరోవైపు ఎల్జీ పాలీమర్స్‌ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య పదికి చేరుకుంది. గ్యాస్‌ను ఎక్కువ మంది పీల్చుకోవడం వల్లే వీరు మరణించి వుంటారని అధికారులు భావిస్తున్నారు. మరింత మెరుగైన వైద్యం కోసం పలువురిని విశాఖలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.

Also Read:ఫ్యాక్టరీ రన్నింగ్ లో లేకపోవడం వల్లే ప్రమాదం: ఎల్జీ ఫ్యాక్టరీ జీఎం

ఈ ప్రమాదంలో కంపెనీ ఉద్యోగులు  ఎవరూ మరణించలేదని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి స్పష్టం చేశారు. విశాఖనగరం గోపాలపట్నం పరిధిలో గల ఆర్ వెంకటాపురంలో గల ఈ కంపెనీ నుంచి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విషవాయువు లీకైంది. దీనిని పీల్చిన మనుషులు, మూగజీవాలు ఎక్కడికక్కడ కుప్పకూలిపోతున్న దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.