గాంధీ చూపిన మార్గంలోనే పయనించాలి: తెలంగాణ సీఎం కేసీఆర్
గాంధీ చూపిన మార్గంలోనే తెలంగాణను సాధించుకున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 16 అడుగుల గాంధీ విగ్రహన్ని సీఎం ఆవిష్కరించారు.
హైదరాబాద్: గాంధీజీ ప్రతి మాట , పలుకు ఆచరణాత్మకమని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఆవరణలో 16 అడుగుల గాంధీ విగ్రహన్నిఆవిష్కరించిన తర్వాత నిర్వహించిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. గాంధీ అందించిన స్వేచ్ఛా వాయువులే స్వాతంత్ర్య ఉత్సవాలుగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గాంధీ చూపిన ఆచరణలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.
ఎన్ని ఆస్తులున్నాశాంతి లేకపోతే జీవితం ఆటవికమేనన్నారు సీఎం కేసీఆర్. ఈ మధ్య మహాత్ముడిని కించపరిచే మాటలను మనం వింటున్నామన్నారు. గాంధీజీని కించపర్చే మాటలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు.ఇలాంటి వాళ్ల మాటలతో మహాత్ముడి ఔన్నత్యం ఏ మాత్రం తగ్గదన్నారు. ఈమధ్య వేదాంత ధోరణిలో నా మాటలున్నాయని చాలా మంది అన్నారన్నారు.
గాంధీజీని పర్సన్ ఆఫ్ ది మిలీనియం అని ఐక్యరాజ్యసమితి కొనియాడిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. యుద్ధాలతో మానవాళి రక్తపాతంతో మునిగిన సమయంలో గాంధీజీ శాంతి ప్రబోధం చేశారన్నారు. గాంధీజీ స్పూర్తితోనే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని నిర్వహిస్తున్నామన్నారు. అహింసా, కరుణ, ధైర్యం, ప్రేమను ఎంచుకున్న గొప్ప వ్యక్తి మహత్మాగాంధీ అని ఆయన చెప్పారు. గాంధీజీ పుట్టిన దేశంలో మనం పుట్టడం కూడా మన అదృష్టమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
సమస్త మానవాళి అహింసతో, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీజీని రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్ముడిగా సంబోధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గాంధీ సిద్దాంతం ఎప్పటికైనా సార్వజనీనమని ఆయన చెప్పారు. కరోనాసమయంలో గాంధీఆసుపత్రి వైద్యులు విశేష సేవలు అందించారని సీఎం కొనియాడారు. గాంధీవైద్యులు కరోనాపైయుద్ధం చేశారన్నారు. మంచి జరిగితే ప్రశంసలు తప్పక వస్తాయని చెప్పారు సీఎం.
also read:గాంధీ ఆసుపత్రి: 16 అడుగుల గాంధీ విగ్రహన్ని ఆవిష్కరించిన కేసీఆర్
ఇవాళే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు.చైనా, పాకిస్తాన్ యుద్ధాల నుండి దేశాన్ని శాస్త్రి కాపాడారన్నారు. జై జవాన్, జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి నినదించారన్నారు. మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జై జవాన్ అగ్నిపథ్ లో నలిగిపోతున్నారని ఆయన పరోక్షంగా కేంద్రంపై విమర్శలు చేశారు.