మెదక్: సిద్దిపేట సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తారు.

తన మాదిరిగా పనిచేసే వ్యక్తి కావాలనే ఉద్దేశ్యంతోనే సిద్దిపేటకు హరీష్ రావుకు ఇచ్చానని చెప్పారు.ఆణిముత్యంలాంటి హరీష్ రావును మీకు అప్పగించినట్టుగా కేసీఆర్ తెలిపారు. హరీష్ రావు నా పేరును నిలబెట్టాడని కేసీఆర్ ఈ సందర్భంగా ఆయనను అభినందించాడు.

సిద్దిపేట నియోజకవర్గంలో  పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో గురువారం నాడు ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన సభలో ఆయన హరీష్ రావును ప్రశంసించారు.

సిద్దిపేటలో చిన్న కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆహ్వానించినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పలు కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాడని ఆయన చెప్పారు. హరీష్ చాలా హుషారు గల వాడని ఆయన చమత్కరించారు. 

also read:సిద్దిపేట డైనమిక్ ప్రాంతం,త్వరలో ఎయిర్ పోర్టు: కేసీఆర్

సిద్దిపేట అంటే  తనకు ప్రాణమని ఆయన చెప్పారు. ఉద్యమ సమయం నుండి ఇప్పటి దాకా సిద్దిపేట తనకు అండగా ఉందన్నారు.సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదన్నారు.సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉందన్నారు. సిద్ది పొందిన పేట అని ప్రసిద్ది అని కేసీఆర్ వివరించారు.

సిద్దిపేటలో సీఎం ప్రసంగం పూర్తైన తర్వాత మంత్రి హరీష్ రావు  సభా వేదికపైనే కేసీఆర్ కాళ్లు మొక్కారు. సిద్దిపేటకు నిధుల మంజూరు చేయడంతోపాటు హరీష్ రావును కేసీఆర్ పలుమార్లు ప్రశంసించారు.హరీష్ రావు తర్వాత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడ కేసీఆర్ కాళ్లకు నమస్కరించారు.