సిద్దిపేట:సిద్దిపేటకు త్వరలో ఎయిర్‌పోర్టు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. గురువారం నాడు సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 

సిద్దిపేట పరిధిలో నాగుల బండ వద్ద ఐటీ టవర్ కు సీఎం  శంకుస్థాపన చేశారు. సిద్దిపేట పరిధిలో  రూ.45 కోట్లతో 2వేల మందికి ఉపాధి కలించే దిశగా  ఐటి టవర్ నిర్మాణానికి  ప్రభుత్వం పూనుకొంది.  

ముఖ్యమంత్రి  సమక్షంలో నాలుగు ఐటి  కంపెనీలు సిద్దిపేట ఐటి టవర్ లో వారి సంస్థ ల ఏర్పాటు కు  ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. జోలాన్ టెక్నాలజీ , విసాన్ టెక్ , ఎంబ్రోడ్స్ టెక్నాలజీ , సెట్విన్ కంపనీలు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నాయి. సిద్దిపేట డైనమిక్ ప్రాంతం... రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఎయిర్ పోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన ప్రకటించారు. 

అనంతరం సిద్దిపేటలో టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు.  ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆయన ప్రారంభించారు. ఇదే నియోజకవర్గంలోని మిట్టపల్లి గ్రామంలో  రైతు వేదిక ను సీఎం  ప్రారంభించారు.