Asianet News TeluguAsianet News Telugu

నితీశ్‌తో భేటీ తర్వాత నేరుగా లాలూ ఇంటికి కేసీఆర్ .. ఆర్జేడీ చీఫ్‌తో భేటీ, ప్రాధాన్యత

ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

telangana cm kcr meets rjd chief lalu prasad yadav
Author
First Published Aug 31, 2022, 7:24 PM IST

బీహార్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజిబిజీగా గడుపుతున్నారు. బుధవారం మధ్యాహ్నం పాట్నా చేరుకున్న కేసీఆర్.. బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లతో కలిసి గల్వాన్ అమరవీరుల కుటుంబాలకు ఆర్ధిక సాయం అందజేశారు. అనంతరం నితీశ్, తేజస్వీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, పలు అంశాలపై ముగ్గురు నేతలు మంతనాలు జరిపారు. అనంతరం ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌తో కేసీఆర్ సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్ధితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఇంటికే పరిమితమైన లాలూ ప్రసాద్ యాదవ్.. రాజకీయాలను తన కుమారుడితో చేయిస్తున్నారు. బీహార్‌లో కొత్త సర్కార్ అలా ఏర్పడిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్‌తో కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

అంతకుముందు కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎనిమిదేళ్లలో మోడీ సర్కార్ చేసిందేమి లేదని.. డాలర్‌తో పోలీస్తే రూపాయి విలువ ఎప్పుడూ లేనంతగా పడిపోయిందన్నారు. అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయని.. సామాన్యులు , రైతులు అంతా ఆందోళనలో వున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో పరిస్ధితులు ఘోరంగా మారుతున్నాయని.. దేశ రాజధాని ఢిల్లీలో నీళ్లకు , కరెంట్‌కు ఇంకా కొరత వుందని ముఖ్యమంత్రి ఆరోపించారు. 

Also Read:మాది థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్, లీడరెవరో త్వరలో చెబుతాం : బీహార్‌లో కేసీఆర్ వ్యాఖ్యలు

ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవడంలో కేంద్రం విఫలమైందని...మోడీ విధానాలతో దేశం నుంచి వ్యాపారులు పారిపోతున్నారని కేసీఆర్ ఆరోపించారు. దేశంలో నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయని.. ప్రధాని ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేరలేదని సీఎం పేర్కొన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే నినాదం ఏమైందని.. జాతీయ జెండాతో సహా అన్నీ చైనా నుంచి దిగుమతి అవుతున్నాయని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మేక్ ఇన్ ఇండియా అంటే ఇదేనా.. బీజేపీ ముక్త్ భారత్‌ను సాధించాలని సీఎం పిలుపునిచ్చారు. నీతీశ్ కూడా బీజేపీ ముక్త్ భారత్ కావాలని కోరుకుంటున్నారని.. బీజేపీ వ్యతిరేకత శక్తుల్ని అంతా సంఘటితం చేయాలని కేసీఆర్ కోరారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం వుందని సీఎం ఆకాంక్షించారు. 

చైనాతో పోలీస్తే మనం ఎక్కడ వున్నామన్న ఆయన.. బీజేపీ ముక్త్ భారత్ అయితేనే దేశం ముందుకు వెళ్తుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మోడీ అసమర్ధ విధానాలతో దేశం తిరోగమన దిశలో వెళ్తోందని... ధర్మం పేరుతో దేశంలో వైషమ్యాలు తీసుకొస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతోన్న రాష్ట్రాల్ని కేంద్రం ఇబ్బంది పెడుతోందని.. దేశంలో వినాశకరమైన పరిస్ధితిని బీజేపీ తీసుకొచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. అన్ని పార్టీలను తుడిచి పెడతామని బీజేపీ నేతలు అంటున్నారని.. రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్ట్‌లు అన్నీంటినీ అమ్మేస్తున్నారని సీఎం ఎద్దేవా చేశారు. అన్నీ అమ్మేసుకుంటూ పోతే ఏం మిగులుతుందన్న ఆయన.. బేచో ఇండియా అనేదే వాళ్ల పాలసీ అని కేసీఆర్ చురకలు వేశారు. బీజేపీలో అంతా సత్యహరిశ్చంద్రులే వున్నారా .. అమెరికా ఎన్నికల్లో మోడీ వేలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎం ప్రశ్నించారు. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం ఎందుకు చేశారని కేసీఆర్ నిలదీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios