ప్రధానితో కెసిఆర్ భేటీ: కీలక అంశాలపై చర్చ

Telangana Cm KCR meets Prime minister Narendra modi
Highlights

తెలంగాణ అంశాలపై ప్రధానితో కెసిఆర్ చర్చ

హైదరాబాద్: తెలంగాణ సీఎం కెసిఆర్ శుక్రవారం నాడు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. పంటకు మద్దతు ధర , కొత్త జోనల్ విధానం, ముస్లిం, ఎస్టీల రిజర్వేషన్ల పెంపు, హైకోర్టు విభజన తదితర అంశాలపై  సీఎం కెసిఆర్ ప్రధానమంత్రితో సమావేశమయ్యారు.

ప్రధానితో సమావేశం కోసం గురువారం నాడే తెలంగాణ  సీఎం కెసిఆర్ ఢిల్లీకి వెళ్ళారు.  నాలుగు రోజుల పాటు కెసిఆర్ ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కెసిఆర్ చర్చించారు.

 రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం, రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఆమోదించాలని ఆయన పీఎంను కోరారు. ప్రధానంగా రిజర్వేషన్ల పెంపు, జోన్ల వ్యవస్థకు సంబంధించిన అంశాలతో పాటు విభజన హమీల అమలు విషయమై ప్రధానితో కెసిఆర్ చర్చించారని సమాచారం.

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి 10 లేఖలను సీఎం కెసిఆర్ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ లేఖల్లో సీఎం కెసిఆర్ ప్రస్తావించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కెసిఆర్ ప్రధానమంత్రిని కోరారు. 

కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఆయన కోరారు. మరో వైపు కరీంనగర్ జిల్లాకు ట్రిపుల్ ఐటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం, ఐటీఐఆర్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

loader